నవాజ్, కర్నెకవిత
సాక్షి, యాలాల: కడుపునొప్పి తాళలేక ఓ మహిళ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని కోకట్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. యాలాల మండలం కోకట్ గ్రామానికి చెందిన కర్నె కవిత(38)ను కర్ణాటక రాష్ట్రం పొసారం గ్రామానికి చెందిన వెంకట్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి అయిన ఆరు నెలలకే గొడవల కారణంగా వెంకట్‌తో కవిత విడాకులు తీసుకుంది.
మాణిక్యం అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లో ఉంటోంది. కొద్ది నెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్న కవిత కోకట్ గ్రామంలో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. పలు ఆస్పత్రుల్లో చూపించిన నొప్పి తగ్గలేదు. ఆదివారం కడుపునొప్పి తీవ్రంగా రావడంతో నొప్పి భరించలేక పురుగుల మందు తాగింది. గుర్తించిన స్థానికులు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కవితను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి సోదరుడు కర్నె మురళికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తండ్రి మందలించాడని మనస్తాపం..
తండ్రి మందలించాడని పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవన్గీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహిపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జీవన్గీ గ్రామానికి చెందిన నవాజ్ (27), ఆస్మాబేగం భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. నవాజ్ వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే నవాజ్ తాగుడుకు బానిసై తరచూ భార్య ఆస్మాబేగంను కొట్టేవాడు.
శనివారం కూడా భార్యతో గొడవపడడంతో గమనించిన నవాజ్ తండ్రి ఖాసీం ఎందుకు గొడవపడుతున్నారని కొడుకును మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన నవాజ్ తాగిన మైకంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తండ్రి ఖాసీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ చెప్పారు.
ఇంట్లో గొడవతో...
క్రిమిసంహారక మందు సేవించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆదిబట్ల ఎస్‌ఐ రామకృష్ణ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం కుదాబాక్షుపల్లి గ్రామానికి చెందిన సిరిపంగి యాదగిరి(22) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఇంట్లో గొడవపడి సాయంత్రం ఆరుగంటల సమయంలో ఇంటి నుంచి నగరానికి వెళ్తున్నానని బయల్దేరాడు.
మనస్తాపానికి గురైన యాదగిరి ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో రాగన్నగూడ అటవీ ప్రాంతంలో రోడ్డుపై పడి ఉన్నాడు. అప్పటికే క్రిమిసంహారక మందు సేవించి వాంతులు చేసుకుంటూ కిందపడిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment