సాక్షి, న్యూఢిల్లీ: భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరూ... జైలు లైఫే సో బెటరు.. అని పాడుకుంటున్నారు అక్కడి ఖైదీలు. సహజంగా జైలు నుంచి ఎప్పుడు బయటపడి తమ వారిని చూసుకోవాలా అని పరితపిస్తారు ఖైదీలు...కానీ ఆ జైలు మాత్రం వారిని ఏ మాత్రం అభద్రతకు లోనుచేయడం లేదు. బయట సమాజం కంటే ఖైదీలు జైలు జీవితాన్నే ఎంజాయ్ చేస్తున్నారు.దేశంలోనే అతిపెద్ద జైలుగా పేరొందిన తీహార్ జైలు ఖైదీలకు మెరుగైన ఆవాస కేంద్రంగా మారింది. తీహార్ జైలులో 15,000 మందికి పైగా ఉంటే వీరిలో 80 శాతం వరకూ విచారణ ఖైదీలు కాగా, వీరిలో 25 శాతం మంది తరచూ నేరాలు చేస్తూ జైలు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. బయటి సమాజంలో ఖర్చులను తట్టుకోలేక వీరు జైలు జీవితానికే మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. వీరంతా 35 సంవత్సరాల వయసు పైబడి తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన వారే. జైలు జీవితమే వీరికి సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఇక్కడ ఒక్కో ఖైదీది ఒక్కో అనుభవం. రెహమాన్ (పేరు మార్చాం..) అనే ఖైదీ తన 21 ఏళ్ల వయసులో కేవలం తనతో వాదించిన కారణంగా ఓ వ్యక్తిని ఆవేశంతో హతమర్చాడు. దీంతో శిక్షకు గురై తీహార్ జైలుకు వచ్చి ఐదేళ్లు గడిపాడు. అనంతరం బెయిల్‌పై విడుదలై వివాహం చేసుకుని ఓ కుమార్తెకు జన్మనిచ్చాడు.18 నెలలు జైలు వెలుపల గడిపిన రెహమాన్ జైలు జీవితం మిస్సవడంతో కలత చెందాడు. ఎలాగైనా మళ్లీ తీహార్ జైలుకు రావాలని గొలుసు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డాడు. అయినా పోలీసులకు పట్టుబడక పోవడంతో ఢిల్లీ వర్సిటీ విద్యార్థినిపై వేధింపులకు దిగి తిన్నగా తీహార్ జైలుకే వచ్చాడు. నేరగాళ్ల జాబితాలో అతని పేరు పునరావృతం కావడంతో మళ్లీ నేరానికి ఎందుకు పాల్పడ్డాడో వివరించడంతో జైలు అధికారులు కంగుతిన్నారు. 18 నెలలు జైల్లో ఉన్న తర్వాత అతడిని భార్య విడిపించుకుని వెళ్లింది. మళ్లీ కొన్నాళ్లకే ఏదో నేరం చేసి తీహార్ జైలుకు వచ్చేశాడు. ఈసారి కొద్దిగా ఒళ్లు చేసిన రెహమాన్ జైలు పరిసరాలు పూర్తిగా అలవాటు కావడంతో తోటి ఖైదీల పట్ల దాదాగా వ్యవహరించడం మొదలుపెట్టాడు.
జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ వెళ్లడంపైనే దృష్టిసారించేవాడు. రెహమాన్ కూతరు పెద్దగైంది. ఒళ్లు వంచడం ఇష్టం లేక, డబ్బుల్లేక భార్యను పుట్టింటికి వెళ్లాలని బలవంతపెట్టేవాడు. ఈ క్రమంలో గత ఏడాది ఢిల్లీలో ఓ దోపిడీకి పాల్పడే క్రమంలో రెహమాన్ ఓ వ్యక్తిని హత్య చేశాడు. దీంతో మళ్లీ తీహార్ జైలు బాట పట్డాడు. పదేపదే నేరాలు ఎందుకు చేస్తున్నావని జైలు అధికారులు గద్దించడంతో అసలు విషయం బయటపెట్టాడు. తనకు ఆదాయ మార్గం లేకపోవడంతో బయట జీవితాన్ని నెగ్గుకురాలేకపోతున్నానని, జైలులో అన్నీ సమయానుకూలంగా లభ్యమవుతున్నాయని, ఆరోగ్యం బాగాలేకుంటే వైద్య సేవలు అందుతున్నాయని తనకు జైలు జీవితమే బాగుందని చెప్పాడు.ఇక్కడ తాను క్రమశిక్షణగా ఉంటున్నానని, జైలు ప్రాంగణంలోనే కార్పెంటరీ పనులు చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నానని అధికారులకు వివరించాడు.
రెహమాన్ లాంటి ఖైదీలు తీహార్ జైలులో అడుగడుగునా కనిపిస్తారు. జైలు జీవితం గడిపి విడుదలైన ఖైదీలకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాలనే ఖైదీల ధోరణి ఎత్తిచూపుతోంది. ఖైదీల్లో మానసిక పరివర్తన దిశగా ప్రభుత్వాలు చొరవ చూపడంతో పాటు వారికి పునరావస ప్యాకేజ్ కల్పించాల్సిన అవసరాన్నీ తీహార్ ఖైదీల ఉదంతం ప్రతిబింబిస్తోంది.