
క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న 108 సిబ్బంది
ముండ్లమూరు: మండలంలోని శంకరాపురం వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ యడ్లపల్లి సునీల్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని పూరిమెట్లకు చెందిన పొగాకు రైతులు ఒగులూరి ఆంజనేయులు, తువ్వదొడ్డి చిన్నబ్బాయి, ఒగులూరి నరేష్, యడ్లపల్లి సునీల్ పొగాకు చెక్కులతో ట్రాక్టర్‌తో అర్ధరాత్రి వెల్లంపల్లికి బయల్దేరారు. మార్గంమధ్యలో దర్శి–అద్దంకి ప్రధాన రహదారిలో శంకరాపురం వద్దకు వెళ్లగానే డీజిల్ లేక ట్రాక్టర్ ఆగిపోయింది. శంకరాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రోడ్డు పక్కన ట్రాక్టర్‌ను ఆపుకుంటున్నారు. ఆ సమయంలో నంద్యాల నుంచి టమోటా లోడుతో అద్దంకి వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సునీల్ ట్రాక్టర్ టాప్‌కు ఇంజిన్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. పొగాకు చెక్కులు ట్రాక్టర్‌పై పడ్డాయి. ప్రమాదాన్ని పసిగట్టిన ఒగులూరి ఆంజనేయులు ట్రాక్టర్ నుంచి పక్కకు దూకేశాడు. పైనే ఉన్న మరో ఇద్దరు ఒగులూరి నరేష్, తువ్వదొడ్డి చిన్నబ్బాయికి, లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ట్రాక్టర్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ సునీల్‌ను బయటకు లాగేందుకు ఆంజనేయులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. క్షతగాత్రులు ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రమాదం ధాటికి పెద్ద శబ్దం రావడంతో దగ్గర్లో ఉన్న శంకరాపురం గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొన్న వైఎస్సార్ సీపీ నాయకులు వెంటనే 108 సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో అక్కడికి చేరుకొన్న 108 సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి ఒంగోలు తరలించారు. ట్రాక్టర్‌లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన సునీల్‌ను బయటకు లాగేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేదు. అప్పటికే రోడ్డుకి ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ రామకృష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పొక్లెయిన్ సాయంతో చెక్కులు తొలగించి డ్రైవర్‌ను పక్కకు తీశారు. అనంతరం రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రాక్టర్‌ను, లారీని తొలగించారు. మృతదేహాన్ని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య ఏసుదయమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. రోడ్డు వెంబడే పడి ఉన్న టమోటాలను స్థానికులు ఎవరికి వారు ఇళ్లకు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment