పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసిన దృశ్యం, ఎల్లయ్య (మృతుడు) పాపయ్య (నిందితుడు)
జోగిపేట(అందోల్): వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన జోగిపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య(23)ను హత్య చేసి జోగిపేటలోని వెంకటేశ్వర సినిమా థియేటర్ వెనుక భాగంలోని ముళ్లపొదల్లో పాతిపెట్టిన విషయం శనివారం సంగారెడ్డి, జోగిపేట పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హతుడు ఎల్లయ్య సంగారెడ్డిలోని టెంట్ హౌస్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జోగిపేటకు చెందిన పాపయ్య కూడా సంగారెడ్డిలో తన భార్య, పిల్లలతో కలిసి కూలీ పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ఎల్లయ్య, పాపయ్యలకు కొంత కాలంగా స్నేహం కుదిరినట్లు సమాచారం.
ఈ క్రమంలో పాపయ్య భార్యతో ఎల్లయ్యకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈనెల 12వ తేదిన పాపయ్య భార్య స్వగ్రామమైన జోగిపేటకు వచ్చింది. అదే రోజు రాత్రి పాపయ్య తన, భార్య పిల్లల వద్దకు జోగిపేటకు వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎల్లయ్య, పాపయ్య భార్యలు తలుపులు పెట్టుకొని ఉన్నారు. భార్య తలుపులు తెరవగానే ఎల్లయ్య కనిపించడంతో ఆగ్రహించిన పాపయ్య గడ్డపారతో అతడి తలపై బలంగా కొట్టాడు. దీంతో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఎల్లయ్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని వెంకటేశ్వర సినిమా థియేటర్ వెనుకభాగంలోని ముళ్లపొదల్లోకి తీసుకువెళ్లి గుంత తవ్వి పాతిపెట్టారు. తన మరిది కనిపించడం లేదని మృతుడి అన్న భార్య సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 12న ఫిర్యాదు చేసింది. దీంతో సంగారెడ్డి స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ విషయంలో పోలీసులు విచారణను చేపట్టారు.
పాపయ్యతో స్నేహం విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతడిని విచారించారు. తానే చంపి జోగిపేటలో పాతిపెట్టినట్లు పాపయ్య సంగారెడ్డి పోలీసులకు తెలియజేశాడు. సంగారెడ్డి సీఐ వెంకటేష్ శనివారం జోగిపేటకు నిందితుడు పాపయ్యను తీసుకురాగా పాతిపెట్టిన స్థలాన్ని చూపించాడు. స్థానిక సీఐ తిరుపతిరాజు, ఎస్‌ఐ వెంకటేష్‌లు మృతదేహాన్ని బయటకు తీయించారు. తహసీల్దారు ప్రవీణ్‌కుమార్, పోలీసు సిబ్బంది సమక్షంలో పంచనామా నిర్వహించారు. తవ్విన చోటనే వైద్య అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. పాపయ్యను సంగారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని ఎల్లయ్య కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment