
గాయాలపాలైన మారివేలు
నెల్లూరు(క్రైమ్) : కారణ మేంటో తెలీదు గానీ.. ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఓ వర్గం ప్రత్యర్థి వర్గంపై కత్తులతో విచక్షణా రహితంగా దాడికి తెగబడింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమారులు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి కొత్తహాల్ సెంటర్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక వివరాలిలా ఉన్నాయి. బోడిగాడి తోటకు చెందిన ఆవుల పొన్నయ్య అంజమ్మ దంపతులు. వారికి నలుగురు కుమారులు. వీరంతా నగరంలో చెత్త ఏరుకొని అమ్ముతుంటారు. రాత్రి వేళ కొత్తాహాల్ సమీపంలోని దుకాణాల వద్ద నిద్రిస్తుంటారు. సోమవారం రాత్రి అంజమ్మ, పొన్నయ్య దంపతులతోపాటు వారి కుమారులు మారివేలు, ప్రసాద్ కొత్తహాల్ సమీపంలోని దుకాణం వద్ద నిద్రకు ఉపక్రమించారు. చిత్తు కాగితాలు, పిక్‌పాకెటింగ్‌లకు పాల్పడే ముజ్జవేలు తన స్నేహితులైన కుమారు, మున్నాలతో కలిసి ఫూటుగా మద్యం సేవించి అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో వారి మధ్య నగదు విషయమై గొడవ జరిగింది.
కోపోద్రిక్తులైన ముజ్జవేలు అతని స్నేహితులు తమ వెంట తెచ్చుకొన్న కత్తులతో ప్రసాద్‌పై దాడికి దిగి గొంతు, మర్మావయవాలు కోశారు. అడ్డుకునేందుకు వెళ/æ్లన అంజమ్మ, మారివేలుపైనా దాడి చేయడంతో అంజమ్మ కుడి చేతికి తీవ్ర గాయమైంది. మారివేలు గొంతుకు బలమైన గాయం కావడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న తల్లి, కుమారులను గమనించిన స్థానికులు ఒకటో నగర ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ పాపారావుకు, 108సిబ్బందికి సమాచారం అందించారు. పాపారావు, ఒకటో నగర ఎస్సై ఖాజావలి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన నిందితుల్లో ముజ్జవేలు తప్పించుకోగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
నగదు కోసమే దాడి
అందరూ నిద్రిస్తుండగా ముజ్జవేలు ప్రసాద్ వద్దకు వచ్చి జేబులో నగదు లాక్కొనే ప్రయత్నం చేశాడని, అతను ప్రతిఘటించడంతో కత్తులతో దాడిచేసి గాయపరిచారని బాధితులతో పాటు సమీపంలో నిద్రిస్తున్న వారు పోలీసులకు తెలిపారు. ముజ్జవేలు రైళ్లల్లో తిరుగుతూ జేబు దొంగతనాలు చేస్తుంటాడని తెలిపారు. ముజ్జవేలు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment