
లక్ష్మిదేవి, శ్రీనివాసులు(ఫైల్)
సాక్షి, కడప(పెనగలూరు) : వాళ్లు వావి వరుసలు మరిచి వివాహేతర సంబంధం కొనసాగించారు. అదికాస్తా శ్రుతి మించి ఇద్దరూ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. విషయం పోలీసు స్టేషన్ వరకు వెళ్లడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. చివరకు వారి పిల్లలు ఒకరు తల్లిని.. మరొకరు తండ్రిని కోల్పోయి అనాథలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. నారాయణ నెల్లూరుకు చెందిన లక్ష్మిదేవి(30)కి 13 ఏళ్ల క్రితం కొత్తసింగనమల గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. బతుకు దెరువుకోసం లక్ష్మిదేవి భర్త గల్ఫ్‌కు వెళ్లడంతో అదే గ్రామంలో ఉన్న వరుసకు చిన్నాన్న అయిన కడప శ్రీనివాసులు(41)తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. కడప శ్రీనివాసులుకు కూడా వివాహమై ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఈ నేపథ్యంలో నాలుగురోజుల క్రితం వీరిద్దరూ ఇంటినుంచి వెళ్లిపోయారు. లక్ష్మిదేవి సంబంధీకులు కేసు పెట్టడంతో ఆదివారం తిరిగి ఇంటికివచ్చారు. ఆ తర్వాత తాము తప్పు చేశామనే మనస్తాపంతో ఇద్దరూ మరణించాలని నిర్ణయించుకుని కూల్‌డ్రింక్స్‌లో విషపు గుళికలు వేసుకుని తాగారు. వీరిని వెంటనే రాజంపేటకు తరలించగా మార్గమధ్యంలో లక్ష్మిదేవి మృతిచెందగా మరికొద్ది సేపటికి శ్రీనివాసులు కూడా మృతి చెందాడు. నారాయణనెల్లూరుకు చెందిన లక్ష్మిదేవి తండ్రి గండికోట సుబ్బనరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపారు. ఇద్దరి మృతదేహాలను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment