చెన్నారెడ్డి, వెంకటమ్మ (ఫైల్)
ప్రొద్దుటూరు క్రైం(వైఎస్సార్ కడప): ప్రొద్దుటూరులో వృద్ధ దంపతులు సోమవారం అర్ధరాత్రి తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. నాగేంద్రనగర్‌లో నివసిస్తున్న భూమిరెడ్డి చెన్నారెడ్డి (68), వెంకటమ్మ (65) పురుగుల మందు తాగి బలవన్మరణం పొందారు. మంగళవారం వేకువజామున నాగేంద్రనగర్‌లోని పుట్టవీధిలో డ్రైనేజీ కాలువ పక్కన వారి మృతదేహాలను బంధువులు గు ర్తించారు. మృతుల బంధువులు, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చాపాడు మండలం సీతారామపురం గ్రామానికి చెం దిన భూమిరెడ్డి చెన్నారెడ్డి సన్నకారు రైతు. అతను వ్యవసాయం చేసుకొని జీవనం సాగించే వాడు. 10 ఏళ్ల క్రితం ఉన్న కొద్దిపాటి పొలాన్ని విక్రయించి భార్యాభర్తలు ప్రొద్దుటూరు వచ్చారు. పుట్టవీధిలో ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉంటున్నారు. మిద్దెపై చిన్న గది నిర్మించుకొని వారు అక్కడే ఉండగా, కింది భాగంలో బాడుగకు ఇచ్చారు. ప్రతి నెలా వచ్చే రూ. 8 వేల బాడుగ డబ్బుతోనే వారు సంసారం నిర్వహించుకునే వారు. ఏళ్లు గడచినా వారికి సంతానం కలుగలేదు. చెన్నారెడ్డికి ఇద్దరు సోదరులు ఉన్నారు.
వెంటాడిన అనారోగ్యం
భార్యాభర్తలకు ఎలాంటి సమస్యలు లేవు. సంతానం లేకపోవడంతో ముందు నుంచి ఒంటరితనంతోనే జీవించారు. ఇది వారిని మానసికంగా వేధించింది. ఐదేళ్ల క్రితం చెన్నారెడ్డికి పక్షవాతం సోకడంతోపాటు గుండె పోటు కూడా వచ్చింది. అప్పటి నుంచి అతను మందులు వాడుతూ బయటికి వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం వెంకటమ్మకు తీవ్ర కడుపునొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. పేగులో ఇన్‌ఫెక్షన్ సోకి వాపు వచ్చిందని పరీక్షలు చేసిన వైద్యుడు తెలిపారు. దీంతో రోజూ ఆమెకు ఆస్పత్రిలో చూపించే వాళ్లు. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బంధువులు ఇంటికి వచ్చి బాగోగులు చూస్తున్నారు. రోజూ ఆస్పత్రికి వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉందని, నొప్పి కూడా తగ్గలేదని ఆమె తమతో చెప్పేదని బంధువులు తెలిపారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి 10.30 వరకూ వృద్ధ దంపతులు, బంధువులు మాట్లాడుకొని తర్వాత నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 12.20 గంటల సమయంలో బంధువుల్లో ఒక మహిళ నిద్రలేచి చూడగా.. వారు మంచంపై కనిపించలేదు. దీంతో ఆమె అందరినీ నిద్రలేపింది. బంధువులు, వీధిలోని ప్రజలు నాగేంద్రనగర్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టు పక్కల వీ«ధుల్లో కూడా వారి కోసం గాలించినా జాడ తెలియలేదు. మంగళవారం వేకువజామున 4.30 గంటల వరకు గాలించినా వారి ఆచూకీ తెలియలేదు. తర్వాత ఇంటి ఎదురుగా ఉన్న కంప చెట్ల వైపు కొందరు వెళ్లి చూడగా.. అక్కడే ఉన్న డ్రైనేజి కాలువ పక్కలో ఇద్దరూ పడి ఉన్నారు. శ్వాస ఉందేమోనని చూడగా అప్పటికే మృతి చెందారు.
చెన్నారెడ్డి జేబును పరిశీలించగా పురుగుల మందు డబ్బా కొనుగోలు చేసిన బిల్లు కనిపించింది. సోమవారం వెంగళరెడ్డిపేటలో మందు డబ్బా కొనుగోలు చేసినట్లు బంధువులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు లేకపోవడం, అనారోగ్యం, ఒంటరితనంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు, బంధువులు తెలిపారు. వీధికి పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు దంపతులు మృతి చెందడంతో నాగేంద్రనగర్‌లో విషాదం నెలకొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment