లక్నో : తమ మాటలకు ఎదురు చెప్పాడన్న కోపంతో ఓ యువకుడిపై ఇద్దరు పోలీసులు దాడి చేశారు. విచక్షణా రహితంగా యువకుడిని చితకబాది చివరకు సస్పెండ్‌కు గురయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్ద్ నగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం మధ్యాహ్నం సమయంలో సిద్ధార్ద్ నగర్ జిల్లాలోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఓ యువకుడు బైక్‌పై వెళుతూ ఇద్దరు పోలీసుల కంటబడ్డాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించావంటూ ఆ ఇద్దరు పోలీసులు యువకుడి బైక్‌ను నిలిపి వేశారు. ఈ నేపథ్యంలో యువకుడికి, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
దీంతో ఆగ్రహించిన పోలీసులు యువకుడిపై దాడికి దిగారు. రోడ్డుపైకి ఈడ్చుతూ, కాళ్లతో తంతూ చిత్రహింసలు పెట్టారు. ‘నేను ఏం తప్పు చేశానో చెప్పండి. నా తప్పుంటే జైలులో పెట్టండి’ అంటూ అతడు ప్రాథేయపడినా కనికరించలేదు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచాడు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయటమే కాకుండా దర్యాప్తుకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment