విశాఖపట్నం, గాజువాక: విద్యార్థులను స్కూల్‌లో దించేసిన అనంతరం ఖాళీ స్థలంలో నిలిపి ఉంచిన రెండు బస్సులు మంటలకు దగ్ధమయ్యాయి. వాటి పక్కనే ఉన్న మరో ఆయిల్ ట్యాంకర్ పాక్షికంగా కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న పెదగంట్యాడ అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు పలు వాహనాలను అగ్ని ప్రమాదం నుంచి రక్షించారు. బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటనలపై ప్రత్యక్ష సాక్షులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక రవీంద్ర భారతి స్కూల్‌కు చెందిన బస్సులను విద్యార్థులను దించేసిన అనంతరం సమీపంలోని డ్రైవర్స్ కాలనీ వద్ద గల ఖాళీ స్థలంలో నిలిపి ఉంచుతారు. వాటి వెనుకనే పెద్ద పెద్ద చెత్తకుప్పలు పేరుకుపోయి ఉంటాయి.
వివిధ రకాల వ్యర్థాలు, మెకానిక్ షాప్‌లలో వాడిన గుడ్డలను అందులో పడేస్తారు. దాని వెనుకనే మద్యం సేవించేవారు, సిగరెట్లు కాల్చేవారు సంచరిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో.. ఎప్పటిలాగే బుధవారం ఉదయం రెండు బస్సుల్లో విద్యార్థులను దించేసిన తరువాత వాటిని యధావిధిగా ఖాళీ స్థలంలో నిలిపి ఉంచారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో డ్రైవర్లు భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి బస్సులను మూడు గంటలకు అక్కడి నుంచి తీయాల్సి ఉంది. ఈ లోగా బస్సుల్లో మంటలు చెలరేగాయి. తొలుత ఒక బస్సులో చెలరేగిన మంటలు వెంటనే పక్క బస్సుకు, ఆ పక్కనే ఉన్న ఆయిల్ ట్యాంకర్‌కు ఎగబాకాయి. దీన్ని గమనించిన స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించడంతోపాటు పెదగంట్యాడ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.
పక్కనే మరో కారు కూడా పార్కు చేసి ఉండటాన్ని గమనించిన స్థానికులు దాని అద్దాలు పగులగొట్టి దూరంగా తరలించారు. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. మంటలను అదుపు చేసే సమయానికి రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆయిల్ ట్యాంకర్‌ను మంటల నుంచి రక్షించారు. వాటితోపాటు ఆ పక్కనే ఉన్న నాలుగు లారీలు, ఒక మినీ బస్సు, మినీ వ్యాన్‌లను మంటలకు గురి కాకండా రక్షించగలిగారు. ప్రమాదంలో రూ.15లక్షల ఆస్తి నష్టం చోటు చేసుకుందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. మరో అరగంటలో పిల్లలు బయలుదేరుతారనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న గాజువాక ట్రాఫిక్, శాంతి భద్రతల పోలీసు అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక సమాచారం సేకరించారు. కాల్చిన సిగరెట్‌ను చెత్తలో పడేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment