కృష్ణవంశీ మృతదేహం, కృష్ణకృప మృతదేహం
సాక్షి, వెలిగండ్ల (ప్రకాశం): ఈత సరదా ఇద్దరు విద్యార్థుల ఉసురు తీసింది. వారు స్వయానా సొంత అన్నదమ్ముల పిల్లలు. నీటిలో మునిగిపోతున్న తమ్ముడిని కాపాడబోయి అన్న కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మండల కేంద్రం వెలిగండ్ల పాలేటివాగు వద్ద సోమవారం జరిగింది. వివరాలు.. వెలిగండ్ల ఎస్సీ కాలనీకి చెందిన తాతపూడి కృష్ణవంశీ (15), తాతపూడి కృష్ణకృప (12), జూటికే రాకేష్, తాతపూడి టింకు అనే నలుగురు విద్యార్థులకు సోమవారం బక్రీద్ సందర్భంగా సెలవు కావడంతో ఈత కొట్టేందుకు గ్రామానికి సమీపంలోని పాలేటి వాగు వద్దకు వెళ్లారు. వాగు లోతు తెలియని నలుగురు విద్యార్థులు ఈత కొట్టేందుకు సిద్ధమయ్యారు.
తొలుత తాతపూడి టింకు, తాతపూడి వంశీ, కృష్ణకృప వాగులో దిగారు. టింకు భయ పడటంతో గట్టుపై ఉన్న రాకేష్ తన చొక్కా విప్పి అందించాడు. టింకు అతికష్టం మీద ఒడ్డుకు చేరుకున్నాడు. కృష్ణకృప వాగులో మునిగిపోతూ చేతులు పైకెత్తడంతో గట్టుపై ఉన్న కృష్ణవంశీ తన తమ్ముడిని కాపాడేందుకు వాగులోకి దూకాడు. కృష్ణవంశీ, కృష్ణకృప ఇద్దరూ వాగులో మునిగిపోయారు. గమనించిన టింకు, రాకేష్‌లు కేకలు పెడుతూ కాలనీలోకి పరిగెత్తారు. కేకలు విన్న స్థానికులు మల్లిబోయిన సుబ్బరాయుడు, అన్నెబోయిన చిన రంగయ్యలు వాగు వద్దకు చేరి వాగులో దూకి కృష్ణవంశీని బయటకు తీశారు. అప్పటికే మరణించినట్లు వారు గుర్తించారు. ఇంకొకరు వాగు లోపల ఉన్నారని చెప్పడంతో మళ్లీ వాగులో దూకి కృష్ణకృపను కూడా బయటకు తీశారు.
కొనూపిరితో కొట్టుమిట్టాడుతున్న కృష్ణకృపను స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లేలోపు మృతి చెందాడు. బంధువులు వచ్చి అన్నదమ్ముల మృతదేహాలను ఇంటికి తీసుకొని వెళ్లారు. ఎస్సై టి.వెంకటరమణ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కనిగిరి సీఐ టీవీవీ ప్రతాప్‌కుమార్ తన సిబ్బందితో వచ్చి మృతదేహాలను పరిశీలించి ఘటన జరిగిన తీరును బంధువులను అడిగి తెలుసుకున్నారు.
ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు..
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. తాతపూడి రాజరత్నం, సునీత దంపతులకు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు మారుతీరావు మూడేళ్ల క్రితం కడుపునొప్పి తట్టుకోలేక తన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయాడు. మూడో కుమారుడు కృష్ణకృప స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. మొదటి కుమారుడు, మూడో కుమారుడు ఇద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికి అందివచ్చిన ఇద్దరు కుమారులు చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కష్టాలన్నీ ఆ కుటుంబానికి రావలా..అయ్యో పాపం..అంటూ గ్రామస్తులు, బంధువులు విచారం వ్యక్తం చేశారు. తాతపూడి రాజరత్నం అన్న తాతపూడి మార్కు(నాని), కెజియమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు.
మొదటి కుమారుడు కృష్ణ బీటెక్ చదువుతున్నాడు. రెండో కుమారుడు కృష్ణవేణు డిప్లొమా చదువుతున్నాడు. మూడో కుమారుడు కృష్ణవంశీ వెలిగండ్ల హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. చేతికంది వచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. తాతపూడి మార్కు(నాని) వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అ«ధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల పిల్లలు చనిపోవడంతో కాలనీలో విషాదం నెలకొంది. వెలిగండ్ల, తాడువారిపల్లి ఎస్సీ కాలనీ వాసులు వచ్చి మృతదేహాలను సందర్శించి బిడ్డలను పొగొట్టుకున్న తల్లిదండ్రులను ఓదారుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment