లక్నో: దేశవ్యాప్తంగా మహిళలపై వరుస హత్యాచార ఘటనలు, దాడులు ఆందోళన రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా పసిపిల్లలు, వృద్దులు అనే తేడా లేకుండా మహిళలపై నమోదవుతున్న అత్యాచార ఘటనలు మహిళ భద్రతను, రక్షణను సవాల్ చేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై దాడిచేసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన దారుణ ఘటన వెలుగు చూసింది. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న బాధితురాలు, గురువారం జరిగిన మరో దాడిలో కూడా చూపించిన తెగువ, సాహసం చర్చనీయాంశమైంది. తనే స్వయంగా పోలీసు ఎమర్జెన్సీ నెంబరు 112 ఫోన్ చేసింది. ఆమె ఫోన్ కాల్‌తోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే తనపై దాడిచేసిన వ్యక్తులు పేర్లను పోలీసులకు వెల్లడించింది.
ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అందించిన కథనం ప్రకారం, మంటల్లో కాలిపోతూ కూడా దాదాపు కిలోమీటరు దూరం పరుగెత్తింది. సహాయం కోసం అర్ధిస్తోంది. ఆమెకు సహాయం చేసేందుకు దగ్గరికెళ్లి ఆమెను పలకరించాను. తన పేరు చెప్పిన వెంటనే.. తన దగ్గరినుంచి ఫోన్ తీసుకుని పోలీసుల అత్యవర నంబరుకు కాల్ చేసిందని ఆయన చెప్పారు. ఆమె మంటల్లో కాలిపోతున్న ఆ దృశ్యం ఇప్పటికే తనను భయాందోళనకు గురిచేస్తోందన్నారు. ఇంతలో పోలీసులొచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారంటూ ఈ దారుణాన్ని గుర్తు చేసుకున్నారు.
కాగా అత్యాచార బాధితురాలు విచారణ నిమిత్తం రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా, ఇటీవల బెయిల్‌పై విడుదలైన నిందితులు దారికాచి, దగ్గర్లోని పొలంలోకి ఈడ్చుకెళ్లి మరి నిప‍్పంటించారు. ఈ ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో ఆమె మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం విమానాశ్రయం నుంచి సివిల్ ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్‌కు ఏర్పాట్లు చేస్తోంది. (లైంగిక దాడి బాధితురాలు కోర్టుకు వెళుతుండగా..)
Comments
Please login to add a commentAdd a comment