తాడేపల్లిగూడెంలో వివరాలు వెల్లడిస్తున్న సీఐ మూర్తి
తాడేపల్లిగూడెం రూరల్ : బాలికను ప్రేమించమంటూ బెదిరించిన నేరంపై వ్యాన్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి తెలిపారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఉంగుటూరు మండలం వీఏ పురం అగ్రహారం గ్రామానికి చెందిన బాలిక (15) పట్టణంలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. రోజు స్కూలుకు వస్తున్న బాలికను స్కూల్ వ్యాన్ డ్రైవర్ కూనా తారక్ నారాయణమూర్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఇటీవల బాలికను పెళ్లి చేసుకుంటానంటూ తాళిబొట్టు కట్టబోయాడు. దీంతో బాలిక దానిని బయటకు పారేయడంతో వ్యాన్ నడుపుతున్న మరో డ్రైవర్ వ్యాన్‌ను ఆపివేశాడు. అక్కడ నుంచి నారాయణమూర్తి పారిపోయే ప్రయత్నంలో బాలికను చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో మంగళవారం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో–2012 చట్టం కింద పట్టణ ఎస్సై కేవీ రమణ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా వ్యాన్ డ్రైవర్ కూనా తారక్ నారాయణమూర్తిని బుధవారం కాకర్లమూడి గ్రామంలో అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు సీఐ మూర్తి చెప్పారు.
పాఠశాల యాజమాన్యంఅప్రమత్తంగా ఉండాలి
పాఠశాల బస్సుల్లో పిల్లల్ని తరలించే సమయంలో స్కూల్ యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మూర్తి సూచించారు. అపరిచిత వ్యక్తులను వ్యాన్ డ్రైవర్లుగా నియమించవద్దని, అందులోనూ బాలికలను వేధిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ నుంచి ఆదేశాలు ఉన్నాయన్నారు. వ్యాన్ డ్రైవర్ వయసు, వ్యక్తిత్వం పరిగణనలోకి తీసుకుని డ్రైవర్లుగా నియమించాలన్నారు. ఎస్సై కేవీ రమణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment