
దిక్కుతోచని స్థితిలో మృతుడి భార్యాబిడ్డలు
పశ్చిమగోదావరి, వేలేరుపాడు: చేతబడి చేశాడన్న అనుమానంతో సోమవారం అర్ధరాత్రి వేలేరుపాడు మండలం రామవరం ఊటగుంపు గ్రామంలో కురసం సీతారాముడు(50)అనే గిరిజనుడిని దారుణంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామవరం ఊటగుంపు గ్రామానికి చెందిన సీతారాముడు చేతబడులు చేస్తాడని గ్రామస్తులకు కొన్నేళ్లుగా అనుమానం ఉంది. రెండు నెలల క్రితం అనారోగ్యంతో గ్రామంలోని ముచిక సురేష్, బందం జోగయ్య అనే ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. అయితే ముచిక సురేష్‌కు, సీతారాముడికి నిత్యం గొడవలు జరుగుతుండేవి. రెండు నెలల క్రితం ముచిక సురేష్ కామెర్ల వ్యాధితో మృతి చెందగా, ఇరవై రోజుల క్రితం బందం జోగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు.
జోగయ్య పెద్దకార్యం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల ఆచారం ప్రకారం పెద్ద దినానికి పేతర కుండలు(ముంతలు) మహిళలు తీసుకెళ్లారు. కుండలు తీసుకెళ్లే మహిళలకు పూనకం వచ్చి సీతారాముడు చేతబడి చేయడం వల్లే ఇద్దరు గిరిజనులు మృతి చెందారని చెప్పడంతో గ్రామస్తులు మరింత కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న సీతారాముడిని సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. తనకే పాపం తెలియదని సీతారాముడు ఎంత ప్రాధేయపడినా వినకుండా గొంతు భాగంలో కత్తులతో నరికారు. దీంతో సీతారాముడు అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడి భార్య ముత్తమ్మ ఫిర్యాదు మేరకు కుక్కునూరు సీఐ బాలసురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏడుగురు గ్రామస్తులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment