దివ్య చుట్టూ రక్కసి మూక!  | Vizag Divya Assassination Case | Sakshi
Sakshi News home page

దివ్య చుట్టూ రక్కసి మూక! 

Published Sat, Jun 13 2020 7:59 AM | Last Updated on Sat, Jun 13 2020 10:58 AM

Vizag Divya Assassination Case - Sakshi

దివ్య (ఫైల్‌)

సీతమ్మధార (విశాఖ ఉత్తర): చిత్ర హింసలు అనుభవించి దారుణ హత్యకు గురైన దివ్య చుట్టూ ఓ రక్కసి మూకే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. కట్టుకున్నవాడు, చేరదీసిన వారు.. ఇలా అందరూ రాక్షసంగా ప్రవర్తించినట్లు విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసింది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పేద కుటుంబంలో పుట్టిన దివ్యకు లోకంపోకడ తెలియక ముందే తల్లి, తమ్ముడు, అమ్మమ్మ హత్యకు గురవడంతో విశాఖ నగరంలోని ఎన్‌ఏడీ కూడలి వద్ద ఉంటున్న గీత వద్దకు చేరింది. దివ్య అందాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న గీత మాయమాటలతో వ్యభిచార రొంపిలోకి దింపింది. కొద్ది నెలల తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని స్వస్థలం చేరగా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన వీరుబాబుతో బంధువులు వివాహం చేశారు.

అయితే భర్త వేధించడంతోపాటు తీసుకొచ్చి మళ్లీ విశాఖలోని గీతకు అప్పగించాడు. అక్కడ కొద్ది రోజులున్న తర్వాత అక్కయ్యపాలెంలోని వసంత అలియాస్‌ జ్యోతి వద్దకు దివ్య చేరింది. అప్పటి నుంచి దివ్య అందంతో వ్యాపారం చేసిన వసంత... ఆర్థిక వ్యవహారాల్లో తేడాలు రావడంతో సుమారు ఆరు రోజులపాటు తిండి పెట్టకుండా తీవ్ర చిత్రహింసలకు గురి చేసి హతమార్చినట్లు విచారణలో వెల్లడయినట్లు తెలిసింది. ఇప్పటికే కస్టడీకి తీసుకున్న వసంత, గీతను బుధవారం నుంచి విచారించిన నగర పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు వారితోపాటు అరెస్టయి జైలులో ఉన్న మరో నలుగురు నిందితులనూ కోర్టు అనుమతితో శుక్రవారం నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. మరోవైపు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు కాల్‌ డేటా ఆధారంగా దివ్య భర్త వీరుబాబుతోపాటు బంధువు కృష్ణని అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. 

మరో రోజు కస్టడీ పొడిగింపు  
మరోవైపు ప్రధాన నిందితురాలు వసంతతోపాటు గీత కస్టడీ శుక్రవారంతో ముగిసినప్పటికీ కోర్టు మరో రోజు విచారణకు అనుమతించింది. దీంతో ఆరుగురు నిందితులనూ శనివారం విచారించి... కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జైలుకు తరలించనున్నారు. అయితే ఎన్నిరకాలుగా విచారిస్తున్నప్పటికీ ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో అన్న విషయాన్ని వసంత వెల్లడించడం లేదు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అన్న కోణాల్లో లోతుగా ఆరా తీస్తున్నారు. దివ్య భర్త వీరుబాబు పాత్రపైనా విచారించారు. మరిన్ని వివరాల కోసం లోతుగా విచారణ సాగిస్తామని పోలీసులు చెబుతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement