సాక్షి, హైదరాబాద్: ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్.. ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఏపీ మంత్రికి ఫోన్ చేసినట్లు స్పష్టమైంది. కేసు దర్యాప్తులో భాగంగా రాకేష్ కాల్ వివరాలు అధ్యయనం చేసిన హైదరాబాద్ పోలీసులు హత్య జరిగిన మరుసటి రోజున నిందితుడి నుంచి సదరు మంత్రికి ఔట్ గోయింగ్ కాల్ ఉన్నట్లు గుర్తించారు. ఓ చిన్న పని ఉందంటూ ఫిబ్రవరి 2న కలుస్తానంటూ నిందితుడు అపాయింట్‌మెంట్ కోరినట్లు, అందుకు మంత్రి అంగీకరించి విజయవాడ రమ్మని చెప్పినట్లు పోలీసు విచారణలో తేలింది. మంత్రిని కలిసేందుకు నిందితుడు హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు విజయవాడకు విమానం టికెట్ బుక్ చేసుకున్నాడు.
అప్పటికే జయరాం హత్య విషయంపై మీడియాలో హంగామా నడుస్తోంది. దీంతో తాను ఇంట్లో ఉంటే పోలీసులకు దొరికిపోతానని గచ్చిబౌలిలో ఉన్న ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకుని అక్కడ బస చేశాడు. తెల్లవారు జామున రాకేష్ శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరుతున్న సమయంలోనే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏపీ టీడీపీ నేతలతో, మంత్రులతో తనకున్న పరిచయాలతో కేసు నుంచి ఎలాగైనా బయటపడొచ్చనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో హత్య చేసి కృష్ణా జిల్లా నందిగామ వద్ద కారును నిందితుడు వదిలి వెళ్లాడని విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
మృతుని భార్య, కుటుంబ సభ్యులు కూడా ఏపీలో అయితే న్యాయం జరగదని, కేసును తారుమారు చేస్తారని ఆరోపించడంతో కేసును తెలంగాణకు బదిలీ చేశారు. ఇప్పుడు వారి ఆరోపణలకు బలం చేకూర్చేలా నిందితుడు మంత్రికి ఫోన్ చేసినట్లు తేలడం చర్చనీయాంశంగా మారింది. మంత్రితో తనకు పరిచయం ఉందని, అయితే ఆ రోజు ఫోన్ చేసినప్పుడు హత్య విషయం చెప్పలేదని రాకేశ్ పేర్కొన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ఇదిలాఉండగా ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల తారుమారుకు సహకరించిన పోలీసు అధికారులు, చోరీ కేసులో నిందితురాలిగా ఉన్న శిఖా చౌదరిలకు నోటీసులు ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment