
రక్తపు మడుగులో శివాజీగణేషన్ మృతదేహం, నిందితురాలు మాధవీరాణి
శాంతిపురం : మండల కేంద్రమైన శాంతిపురంలో శుక్రవారం రాత్రి ప్రముఖ వ్యాపారి శివాజీగణేషన్ (40) హత్యకు గురయ్యాడు. తానే భర్తను హత్య చేశానని భార్య మాధవీరాణి (35) శనివారం తెల్ల వారుజామున 2 గంటల ప్రాంతంలో పోలీసులకు లొంగిపోయింది. టీడీపీ నాయకుడు పాండురంగ(పండరి) సోదరుడైన శివాజీగణేషన్ స్థానిక శివా లయం వీధిలో పాండురంగ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి దుకాణం నుంచి ఇంటికి వెళ్లిన ఆయన అర్ధరాత్రి తర్వాత సొంత ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. తమకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, కుమారుడి కోసం మరో పెళ్లి చేసుకుంటానని వేధిస్తుండడంతో హత్య చేసినట్టు భార్య మాధవిరాణి తెలిపింది.
ఆమెను పోలీసులు కుప్పం సీఐ కార్యాలయానికి తరలించారు. శివాజీగణేశన్ శరీరంపై పదికి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. అలాగే గొంతు కోసిన ఆనవాళ్లు ఉన్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన రాళ్లబూదుగూరు ఎస్‌ఐ వెంకటశివకుమార్ విచారణ ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి సమాచారం సేకరించారు. మృతదేహాన్ని కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. శివాజీ స్వగ్రామమైన రామాపురంలో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
చెదిరిన కుటుంబం
మృతుడు శివాజీగణేషన్‌కు ఇద్దరు కుమార్తెలు సాత్విక, భూమిక ఉన్నారు. తండ్రి హత్య గురికావడం, తల్లి జైలు పాలు కావడంతో వారి రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. అన్నదమ్ములైన పండరి, శివాజీగణేషన్ ఐక్యతకు నిదర్శనంగా ఉండేవారు. తమ్ముడు దూరం కావడాన్ని అన్న జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే కుమారుడి మరణాన్ని చూసి తల్లిని గుండెలవిసేలా రోదిస్తోంది.
కాల్ డేటా కీలకమయ్యేనా ?
శివాజీ హత్య కేసులో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లకు గట్టి ఆధారాలేవీ లభించలేదు. ఈ తరుణంలో కేసు విచారణకు కాల్ డేటా కీలకంగా మారే అవకాశం ఉంది. శాంతిపురంలోని మొబైల్ టవర్ల నుంచి అర్ధరాత్రిలో వెళ్లే, వచ్చే కాల్స్ పరిమితంగానే ఉంటాయి. ఇక్కడ ఉన్న ఐదు కంపెనీల సెల్ టవర్ల నుంచి సంఘటనకు ముందు జరిగిన సంభాషణల వివరాలు ఆరా తీస్తే కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పోలీసులు లోతైన విచారణ జరిపితే హత్య వెనక వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.
భార్యే హత్య చేసిందా?
తాను ఒక్కతే భర్తను హత్య చేశానని మాధవిరాణి చెబుతోంది. హత్య జరిగిన తీరు చూస్తుంటే పక్కా ప్రణాళికతో చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన జరిగిన గది పక్కనే ఉన్న మరో గదిలో మృతుడి తల్లి ఉన్నారు. ఆమెకు గానీ, ఇరుగు పొరుగు వారికి గానీ శబ్దం వినపడకుండా హత్య చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గదిలోని గోడలపై రక్తపు మరకలు ఉన్నాయి. అవి కత్తిపోట్ల సమయంలో అతను కేకలు వేయకుండా ఎవరైనా నోరు నొక్కిపెట్టారా? అనే కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులకు చిక్కిన కత్తి మధ్య భాగంలో మాత్రమే రక్తం ఉంది. శరీరంపై కనిపిస్తున్న కత్తి పోట్లకు వాడిన ఆయుధం ఏమైంది? కూరగాయలు కోసే సాధారణ కత్తితో వ్యక్తిని పదికి పైగా చోట్ల పొడిస్తే అది వంగిపోవాలి. కానీ పోలీసులు స్వాధీనం చేసుకున్న కత్తి చెక్కుచెదరకుండా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment