శవాన్ని వెలికి తీయిస్తున్న పోలీసులు, ఇన్‌సెట్లో బయట పడ్డ మృతదేహం
బూర్గంపాడు: ఓ ఇల్లాలు, తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. వీరిద్దరూ కలిసి మృతదేహాన్ని గోదావరి ఇసుకలో పాతిపెట్టారు. భద్రాచలం సీఐ సత్యనారాయణరెడ్డి, బూర్గంపాడు ఎస్‌ఐ సంతోష్ తెలిపిన వివరాలు.... భద్రాచలం పట్టణానికి చెందిన ఐతంరాజు కొండలరావు(35)కు భార్య ముక్తేశ్వరి, కుమార్తె సంధ్యారాణి ఉన్నారు. కుమార్తె ఓణీల వేడుక ఇటీవలే జరిగింది. కొండలరావు, సీపీఎం పట్టణ కార్యాలయ బాధ్యుడిగా, రజక సంఘం జిల్లా నాయకుడిగా ఉన్నాడు. ముక్తేశ్వరికి, నాని అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. తమ ఇద్దరి మధ్య సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను చంపేందుకు ముక్తేశ్వరి పథకం వేసింది.
బుధవారం అర్థరాత్రి సమయంలో కొండలరావును అతని భార్య ముక్తేశ్వరి, ఆమె ప్రియుడు నాని, అతని స్నేహితుడు శివ కలిసి గొంతు నులిపి చంపారు. ఆ సమయంలో అక్కడ ముక్తేశ్వరి అక్క కొడుకు రుద్రబోయిన గోపి ఉన్నాడు. హత్య చేయడాన్ని అతడు చూశాడు. ఇక్కడ చూసిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని గోపిని వారు ముగ్గురూ కలిసి బెదిరించారు. ఆ తరువాత, మృతదేహాన్ని ఆటోలో వేసుకుని ముక్తేశ్వరి, నాని, శివ, గోపి, సం«ధ్యారాణి(కుమార్తె) కలిసి భద్రాచలం నుంచి బూర్గంపాడు మండలంలోని పాతగొమ్మూరు ఇసుక రేవుకు తీసుకొచ్చారు.
గోదావరిలోకి దిగి, ఇసుకలో గోయి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అక్కడి నుంచి ఆటోలో నాని, శివ పరారయ్యారు. ముక్తేశ్వరి, సంధ్యారాణి కలిసి ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం ముక్తేశ్వరి ఇంటి నుంచి తన ఇంటికి వెళ్లిన గోపి, తాను చూసిన విషయాన్ని తన కుటుంబీకులతో చెప్పాడు. వారు సీపీఎం నాయకులకు సమాచారమిచ్చారు. కొండలరావు సోదరి కొక్కిరేణి లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని బయటకు తీయించారు. శవ పంచనామా కోసం భద్రాచలం ఆస్పత్రికి పంపించారు. పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం నాయకులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment