పట్టుబడిన మహిళా దొంగ
పొన్నలూరు: పశువుల మేత కోసుకుని ఇంటికి వస్తున్న మహిళ కళ్లల్లో కారం చల్లి ఆమె మెడలోని బంగారాన్ని చోరీకి యత్నించిన సంఘటన మండల కేంద్రం పొన్నలూరులో సోమవారం సాయంత్రం జరిగింది. బాధితరాలు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని జెడ్ మేకపాడుకు చెందిన కాటూరి సత్యవతికి చౌటపాలెం గ్రామానికి చెందిన వ్యక్తితో కొన్నేళ్ల కిందట వివాహమైంది. కొంత కాలం భర్త దగ్గర ఉన్నా కొన్ని రోజుల తర్వాత విభేదించి పొన్నలూరు చ్చి ఆద్దింట్లో ఉంటోంది. గ్రామంలో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పాలడుగు సుబ్బులు అనే మహిళ పశువుల మేత కోసం సమీపంలోని పొలాల్లోకి వెళ్లింది. సుబ్బులు మేడలో ఉన్న బంగారు చైను, నల్లపూసల దండ ఉండటాన్ని సత్యవతి గమనించింది.
సాధారణంగా వెళ్తే ఆమె గుర్తుపడుతుందని సత్యవతి ప్యాంటు, చొక్కా, టోపీ ధరించి ముఖంపై నల్ల రంగును పూసుకోని సుబ్బులు వెళ్లిన కొద్దిసేపటికి ఆమెను అనుసరించింది. సుబ్బులు మేత ఎత్తుకుని వస్తున్న క్రమంలో వెనుక వైపుగా వచ్చిన సత్యవతి ముందుగా కళ్లల్లో కారం చల్లి ఆమెను కింద పడేసి మెడలోని రెండు సవర్ల బంగారు నల్లపూసల దండ లాగింది. బాధితురాలు పెద్దగా కేకలు వేసి సత్యవతిని గట్టిగా పట్టుకుంది. ఇంతలో పక్క పొలంలో పనిచేస్తున్న గ్రామస్థుడు పరుగున వచ్చి సత్యవతిని పట్టుకున్నాడు. పక్కనే ఉన్న యువకులు కూడా వచ్చి సత్యవతిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇటీవల పార్థీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు పుకార్లుతో పాటు గ్రామానికి సమీపంలో ఈ సంఘటన జరగడంతో గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment