
మణికంఠన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: వరుసకు సోదరుడైన వ్యక్తి లైంగిక వేధింపులకు ఆమె తట్టుకోలేకపోయింది. అపరకాళిగా మారి అంతమొందించింది. తేనీ జిల్లా ఉత్తమపాళయంకు చెందిన అరటి ఆకుల వ్యాపారి మణికంఠన్ (38)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మణికంఠన్ బావమరిది పాండీశ్వరన్ (30) భార్య నిరంజన (25)లకు ఇద్దరు పిల్లలున్నారు. మణికంఠన్, పాండీశ్వరన్ కొన్నేళ్ల క్రితం టీ బంకు నడిపారు. ఈ సమయంలో నిరంజనపై కన్నేసిన మణికంఠన్ తరచూ సెల్‌ఫోన్‌లో ఇబ్బందికరమైన సంభాషణ చేసేవాడు. అనేకసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో భర్తకు ఫిర్యాదు చేసింది.
ఈ వివాదం కారణంగా టీ బంకును ఎత్తివేసి ఇరువురూ వేర్వేరు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అయినా బుద్ధి మార్చుకోని మణికంఠన్ నిరంజనకు సెల్‌ఫోన్ ద్వారా అసభ్య సంభాషణలు కొనసాగించాడు. దీంతో విసిగిపోయిన నిరంజన శనివారం ఉదయం భర్తతో కలిసి మణికంఠన్ దుకాణానికి వెళ్లి నిలదీసింది. ఈ సమయంలో ఘర్షణ వాతావారణం చోటుచేసుకోగా నిరంజన తన వెంట తెచ్చుకున్న కొడవలితో మణికంఠన్‌ను హతమార్చింది. రక్తం మడుగులో ఉన్న మణికంఠన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. భార్యాభర్తలిద్దరూ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా వారిని అరెస్ట్ చేశారు.