
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
నగర శివారులోని రామవరప్పాడులో మంగళవారం వెలుగులోకి వచ్చిన వివాహిత హత్య నగరంలో సంచలనం కలిగించింది. ఒంటరిగా ఉంటున్న మృతురాలు మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సంఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
కృష్ణాజిల్లా , పటమట/రామవరప్పాడు: ఒంటరిగా ఉంటున్న మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామవరప్పాడు కొల్లా వారి వీధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన పువ్వాడ కల్యాణి (35) ఏడాది క్రితం భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో అక్కడి నుంచి రామవరప్పాడు వచ్చి ఉంటోంది. భర్త మృతితో వచ్చిన నష్టపరిహారంతో స్థానికంగా వడ్డీ వ్యాపారం చేసేది. మంగళవారం కల్యాణి ఉంటున్న పోర్షన్‌లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తీసుకుని లోనికి వెళ్లి చూస్తే కల్యాణి హత్యకు గురైనట్లు గుర్తించారు. గొంతుపై కత్తిగాట్లు ఉన్నాయని, దుండగులు కత్తితో పీక కోసి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కల్యాణి వద్ద నగదు, నగలు ఉంటాయని సమాచారం తెలిసిన వ్యక్తులే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని, తరచూ కల్యాణి వద్దకు వచ్చేవారి వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్
ఒంటరిగా ఉంటున్న మహిళ దారుణ హత్యకు గురైందన్న సమాచారం అందుకున్న సెంట్రల్ ఏసీపీ సత్యానందం, జాయింట్ సీపీ రమణ కుమార్, సీఐ దామోదర్, ఏసీపీ సుందరబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న ప్రాథమిక సమాచారంతో డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. పోలీసు కుక్కలు మహిళ హత్యకు గురైన గదిలో కొద్ది సేపు కలియతిరిగి కొల్లా వారి వీధి వరకూ వెళ్లి ఆగిపోయాయి. ఒక వైపు క్లూస్ టీం మృతదేహం వద్ద, అక్కడే పడి ఉన్న సామాన్ల వద్ద వేలిముద్రలు సేకరించారు.
మృతదేహం సమీపంలో కండోమ్‌లు, మద్యం సీసాలు
హత్యకు గురైన గదిలో ఒక మూలన 5 కండోమ్‌లు, ఖాళీ మద్యం సీసాలు పడి ఉన్నాయి. దొరికిన ఈ కండోమ్‌ల్లో ఒకటి వాడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. హతురాలు కల్యాణికి వివాహేతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్యకు గురైన కల్యాణి మెడలో ఉండాల్సిన బంగారు ఆభరణాలు, ఇంటి ఆవరణలో ఉండాల్సిన వాహనం మాయమవడంతో ఈ హత్య తెలిసినవారిపనా? లేక దుండగులు చేశారా? అన్న కోణంలో పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment