రక్తపు మడుగులో బీరమ్మ మృతదేహం
మెదక్ మున్సిపాలిటీ : ఆస్తి కోసం అన్న భార్యను తమ్ముడు కిరాతకంగా హతమార్చిన సంఘటన మెదక్ పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నవాబుపేట వీధికి చెందిన నంగి బీరమ్మ(44) భర్త ప్రకాశ్ గతంలో మరణించాడు. అయితే వీరికి సంతానం లేకపోవడంతో బీరమ్మ ఓ చిన్నారిని దత్తత తీసుకొని పెంచుకుంటోంది. కాగా బీరమ్మ భర్త ప్రకాష్ తమ్ముడు రాంసురేందర్‌కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. బీరమ్మ పేరున ఒక ఎకరంన్నర పొలం ఉంది. ఈ క్రమంలో తన పిల్లలను దత్తత తీసుకోకుండా ఎక్కడి నుండో పిల్లను తెచ్చుకొని సాకడం ఏంటని రాంసురేందర్ బీరమ్మతో తరచూ గొడవ పడేవాడు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటి ముందు బీరమ్మ తను దత్తత తీసుకున్న కూతురు తేజకు అన్నం తినిపిస్తోంది. ఇదే సమయంలో రాంసురేందర్ అక్కడికి కత్తితో వచ్చి బీరమ్మను నరికాడు. దీంతో బీరమ్మ రక్తం మడుగులో కొట్టుకొని అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. వెంటనే రాంసురేందర్ అక్కడి నుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ భాస్కర్, క్లూస్‌టీం సహాయంతో వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
తీవ్ర ఉద్రిక్తత:
ఆస్తి కోసం అన్న భార్యను చంపేయడంతో నవాబుపేట వీధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాంసురేందర్ తన పిల్లలను బీరమ్మ దత్తత తీసుకుంటే ఆమె ఆస్తి కూడా తనకే వచ్చేదని ఆశపడేవాడని స్థానికులు ఆరోపించారు. బీరమ్మ మృతి పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. బీరమ్మ దుర్మరణంతో దత్తత తెచ్చుకున్న చిన్నారి అనా«థగా మారింది. ఆ చిన్నారిని చూసి స్థానికులు కంటతడిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment