
విజయవాడ: ఆవేశం ఆ ఇల్లాలిలోని మానవత్వాన్ని చంపేసింది. కొడుకులా చూసుకోవాల్సిన మరిదిపైనా, చెల్లెలిలా చూసుకోవాల్సిన ఆడపడుచుపైనా కక్షపెంచుకునేలా చేసింది. కసాయిగా మారిన వదినే ఆ ఇద్దరి పాలిట అపరకాళికను చేసింది. విజయవాడలో సంచలనం రేకెత్తించిన సంఘటన కానూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. పైఫోటోలో కనిపిస్తోన్న మహిళ పేరు ముంతాజ్. మానసిక వ్యాధితో బాధపడుతోన్న ఆడపడుచు హసీనా వైద్యానికి భర్త సంపాదన ఖర్చు చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోయింది.
పెళ్లికి ముందు వరకు తనతో బాగుండిన మరిది ఖలీల్ ఇప్పుడు పట్టించుకోకపోవడంతో పగపట్టింది. ఇద్దరినీ అంతమొందించాలని స్కెచ్ వేసింది. కుట్రలో భాగంగా హసీనా, ఖలీల్‌లపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో ఆడపడుచు హసీనా అక్కడికక్కడే మృతిచెందింది. 80 శాతం గాయాలతో కొట్టుమిట్టాడుతోన్న ఖలీల్‌ని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంతాజ్ ఇంత దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.