![Women CEO Complaint Against OLA Cab Driver in Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/13/ola.jpg.webp?itok=-UGZuYWo)
సాక్షి బెంగళూరు: మహిళా ప్రయాణికురాలిపై అనుచితంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్‌ను ‘ఓలా క్యాబ్స్’ బ్లాక్‌లిస్టులో పెట్టింది. ముంబైకి చెందిన ఒక కంపెనీ సీఈవో ఆకాంక్ష పూజారి ఈ నెల 10న అర్ధరాత్రి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు నగరానికి ఓలా క్యాబ్ ద్వారా బయలుదేరారు. ఈ సమయంలో గూగుల్ మ్యాప్ సూచించిన రూట్‌లో కాకుండా వేరే దారిలో వెళ్లడాన్ని గమనించిన ఆకాంక్ష.. మ్యాప్‌ప్రకారమే వెళ్లాలని డ్రైవర్‌కు సూచించింది. అయితే ఆమె సూచనలను డ్రైవర్ బేఖాతరు చేస్తూ క్యాబ్‌ను మధ్యలోనే నిలిపేసి ‘వస్తే రండి... లేకపోతే దిగిపోండి’ అంటూ పరుషంగా మాట్లాడాడు. డ్రైవర్ ప్రవర్తనతో విస్తుపోయిన ఆకాంక్ష వెంటనే ఓలా సహాయవాణి బటన్‌ను నొక్కింది. ఆ వెంటనే ఓలా సహాయవాణి నుంచి ఫోన్ వచ్చింది. ఆకాంక్షతో మాట్లాడి ఆమె ఫిర్యాదును సహాయవాణి తీసుకుంది. అనంతరం హెల్ప్‌లైన సిబ్బంది ఒకరు డ్రైవర్‌తో మాట్లాడి మహిళకు కూడా ధైర్యం చెప్పారు. మిమ్మల్ని సురక్షితంగా తమ డ్రైవర్ గమ్యస్దానానికి చేరుస్తారని, కారు సంచరించే మార్గాన్ని కూడా ట్రాక్ చేస్తామని, ఒకవేళ రూట్ మారిస్తే మిమ్మల్ని మళ్లీ సంప్రదిస్తామని ఆకాంక్షకు సహాయవాణి సిబ్బంది ఒకరు తెలిపారు. వారి హామీతో సదరు మహిళ ప్రయాణం కొనసాగించింది. అయితే మరోసారి డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతూ కారు నడుపుతుండడంపై ఆకాంక్ష అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో మరోసారి హెల్ప్‌లైన్ సెంటర్ ప్రతినిధి డ్రైవర్‌కు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి ప్రయాణికురాలు గమ్యం చేరే వరకు కాల్ కట్ చేయకుండా డ్రైవర్‌కు సూచనలు చేశారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులకు సైతం ఆకాంక్ష ఫోన్ చేసి కారు నంబర్ తెలియజేసింది. ఈ విషయానంతా సదరు ప్రయాణికురాలు ట్వీటర్‌లో తెలిపారు.
ప్రయాణికుల భద్రతే ముఖ్యం..
డ్రైవర్ ప్రవర్తనతో ప్రయాణికురాలు పడిన ఇబ్బందికి చింతిస్తున్నట్లు ఓలా ప్రతినిధి తెలిపారు. ఆమె ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వెంటనే డ్రైవర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు వెల్లడించారు. తమకు తమ ప్రయాణికుల భద్రతే తొలి ప్రాధాన్యమని తెలిపారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైన పరిష్కరించేందుకు అన్నివేళల తమ అత్యవసర సేవా సిబ్బంది సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఎలాంటి ఇబ్బంది కలిగిన ఓలా యాప్‌లో అత్యవసర బటన్ నొక్కగానే తమ సిబ్బంది స్పందిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment