గాయపడిన హాన్షిత,మృతి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఫిరోజ్
ఆనందపురం(భీమిలి): ఓ యువ ఇంజినీర్ స్నేహితులతో కలసి విహారయాత్ర వెళ్లాడు. అక్కడ వారితో మధురానుభూతులను పంచుకుంటూ ఉల్లాసంగా గ డిపాడు. ఆ క్షణాలను నెమర వేసుకుంటూ సాయంత్రం తిరిగి బైక్‌పై ఇంటికి బయలు దేరాడు. కానీ.. ఇంటికి చేరక ముందే ఆ యువ ఇంజినీర్‌ను లారీ రూపంలో మృత్యువు కబళించి తల్లిదండ్రులకు శోకం మిగిల్చింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని భీమిలి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలివి.
నగరంలోని ఎంవీపీకాలనీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఫిరోజ్ (20) వరంగల్ నిట్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కళాశాలకు సెలవు ఇవ్వడంతో ఇటీవల తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. తన పాత స్నేహితులను కలుసుకుని అందరితో కలసి విహార యాత్రకు వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుమారు పది మంది స్నేహితులతో కలసి బైక్‌లపై భీమిలి తీరంలో ఉన్న దివీస్ జెట్టీ వద్దకు వెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు స్నేహితులందరూ ఉల్లాసంగా గడిపి తిరిగి ఎంవీపీకాలనీకి ప్రయాణమయ్యారు. భీమిలి క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకునే సరికి అబ్దుల్ ఫిరోజ్ బైక్‌ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టి సుమారు 10 మీటర్ల వరకు ఈడ్చుకుపోయింది.
ఈ ఘటనలో అబ్దుల్ ఫిరోజ్‌తో పాటు మోటార్ బైక్ వెనుక వైపు కూర్చున్న మరో ఇంజినీరింగ్ విద్యార్థిని హాన్షిత (19) తీవ్రంగా గాయపడ్డారు. ఆమె విజయవాడలో చదువుతు న్నారు. సంఘటన విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది వారిద్దరిని మధురవాడ సమీపంలోని గాయత్రి ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అప్పటికే అబ్దుల్ ఫిరోజ్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. హాన్షితకు మెరుగైన వైద్యం అందించడానికి నగరంలోని కేర్ ఆస్పత్రికి బంధువులు తరలించారు. ప్రమాదంలో ద్విచక్రవాహనం తుక్కు తుక్కు అయింది. సంఘటన జరిగిన ప్రాంతాన్ని సీఐ గోవిందరావు పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును సీఐ ఆర్.గోవిందరావు దర్యాప్తు చేస్తున్నారు.
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
భీమిలి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న అవుట్ పోస్టును ఎత్తి వేయడంతో నేరాలతో పాటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని వివరిస్తూ ‘శివారులో భద్రతెంత’అనే శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అక్కడ సిబ్బంది లేకపోవడంతో ట్రాఫిక్ నియంత్రణ లేక ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించింది. ఇప్పటికైనా అధికారులు భీమిలి క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ప్రమాదానికి కారణమైంది అదే లారీ
ఆనందపురం జంక్షన్ వద్ద ఈ ఏడాది మే 5న జరిగిన ప్రమాదానికి కారణమైన లారీయే.. మం గళవారం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైంది. అప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌బీ కానిస్టేబుల్ రాధాకృష్ణ మృతి చెం దారు. అప్పటి.. ఇప్పటి సంఘటనలను పరిశీలిస్తే.. మోటారు బైక్‌లను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకొని పోవడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment