చెన్నై,టీ.నగర్: తేని సమీపాన తల, చేతులు, కాళ్లు నరికిన స్థితిలో ఆదివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గోనె సంచిలో చుట్టి ముల్‌లైనదీ తీరంలో విసిరేసిన ఘటన సంచలనం కలిగించింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. తేని జిల్లా, కంభం సురుళిపట్టి రోడ్డు మీదుగా ముల్‌లైనది ప్రవహిస్తోంది. రాత్రి సమయంలో ఇక్కడ కొందరు చేపలు పడుతుంటారు. ఇలావుండగా ఆదివారం రాత్రి పది గంటల సమయంలో బండిపై వచ్చిన ఒక స్త్రీ, పురుషుడు గోనె సంచితో తొట్టమన్‌తురై ప్రాంతానికి వెళ్లారు. అనుమానించిన చేపలు పడుతున్నవారు కంభం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని గోనె సంచిని తెరిచిచూడగా 30 ఏళ్ల యువకుడి మృతదేహపు భాగాలు కనిపించాయి. తలలేని మొండాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల, కాళ్లు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తేని ఎస్పీ సాయిచరన్ తేజస్వి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తర్వాత ఆస్పత్రిలో మృతదేహాన్ని తిలకించారు. దీనిపై విచారణకు నాలుగు ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.
మైలాడుదురై సమీపాన యువకుడి హత్య
పంచాయతీలో జరిగిన ఘర్షణలో ఆదివారం ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి గ్రామపెద్ద సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నాగై జిల్లా, మైలాడుదురై సమీపంలోని పాలయూరు చిన్నకొక్కూరుకు చెందిన రైతు విజయకుమార్ ఆదివారం మృతిచెందాడు. మధ్యాహ్నం శవాన్ని గ్రామంలో ఊరేగించారు. విజయకుమార్ బంధువులు మాధవన్, రంజిత్ శవంపై పూవులు చల్లుతూ బయలుదేరారు. మార్గమధ్యంలోని ఆలయం వద్ద పూలు చల్లరాదని అదే ప్రాంతానికి చెందిన శేఖర్ కుమారుడు శరవణన్ (24) సూచించాడు. దీన్ని ఖాతరు చేయకుండా వారు అక్కడ పూలు చల్లారు. దీంతో వారి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహించిన శరవణన్ మాధవన్, రంజిత్‌పై దాడి చేశాడు. గ్రామస్తులు సర్దిచెప్పారు. తర్వాత మృతదేహానికి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇలావుండగా మాధవన్, రంజిత్ ఊరి పెద్ద రామచంద్రన్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామపెద్ద ఆదివారం రాత్రి సమావేశం జరిపి మాట్లాడారు. ఆ సమయంలోనూ శరవణన్, మాధవన్, రంజిత్ మధ్య ఘర్షణ ఏర్పడింది. మాధవన్‌కు మద్దతుగా గ్రామపెద్ద, సెంథిల్‌కుమార్ తోపాటు నలగురు శరవణన్‌పై దాడి చేశారు. ఇందులో శరవణన్‌కు కత్తిపోట్లు పడ్డాయి. రక్తపు మడుగులో పడిన శరవణన్‌ను ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. దీనిపై పాలయూరు పోలీసులు కేసు నమోదు చేసి రామచంద్రన్ సహా నలుగురిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment