
బంజారాహిల్స్ (హైదరాబాద్ సిటీ): మద్యం మత్తులో నగరంలో కొందరు యువకులు హల్‌చల్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్‌లోగల సుఖ్‌సాగర్ హోటల్‌కు ఆదివారం వేకువజామున ఇందిరానగర్‌లో నివసించే సాయి, రాజ్‌కుమార్ పటేల్‌తోపాటు మరో ఐదుగురు యువకులు మద్యం మత్తులో వచ్చారు.
వచ్చి రాగానే ఇష్టం వచ్చినట్లు మాటలంటూ హోటల్ సిబ్బంది వెంకటేష్, అనిరుద్‌లపై దాడికి పాల్పడ్డారు. తాము వచ్చినప్పుడు పక్కకు జరగకుండా అడ్డుగా ఉన్నారంటూ సాయి వారితో వాగ్వాదానికి దిగాడు. జరుగుతున్నామని చెబుతున్నా వినిపించుకోకుండా మద్యం మత్తులో వారిని తీవ్రంగా కొట్టారు. బాధితులిద్దరూ సాయి ఇంట్లోనే కిరాయికి ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.