న్యూఢిల్లీ: నార్వేలో భారతీయురాలికి జన్మించిన చిన్నారిని అధికారులు తీసుకెళ్లిన కేసు విషయమై ఓస్లో (నార్వే రాజధాని)లోని భారత రాయబారి మంగళవారం సంబంధిత అధికారులను కలిశారు. తల్లిదండ్రులు చిన్నారిని సరిగా చూసుకోవడం లేదని ఫిర్యాదు అందడంతో కొన్ని రోజుల క్రితం ఐదున్నరేళ్ల బాలుడిని అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో బాలుడి తల్లికి భారత పౌరసత్వం ఉండగా, తండ్రి, బాలుడు నార్వే పౌరులు.
తమ బిడ్డను అనవసరంగా, అన్యాయంగా అధికారులు తమకు దూరం చేస్తున్నారనీ, కేసులో కలగజేసుకుని కొడుకును మళ్లీ తమ వద్దకు చేర్చాలని గతంలో తల్లి గుర్విందర్‌జిత్ కౌర్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విన్నవించారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారు. తత్ఫలితంగా మంగళవారం భారత రాయబారి నార్వే అధికారులను కలవగా, చాలా సున్నితత్వంతో నార్వే చట్టాల ప్రకారం ఈ కేసును పరిష్కరిస్తున్నామని వారు తెలిపారు.
సమావేశానికి ముందు ఈ విషయంపై భారత్‌లో సుష్మ మాట్లాడుతూ బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. బిడ్డలను కన్న తల్లిదండ్రులే బాగా చూసుకోగలరనీ, పెంపుడు తల్లిదండ్రులకు భారతీయ సంస్కృతి, మన ఆహార అలవాట్ల గురించి ఏమీ తెలీదని అన్నారు. నార్వేలో చిన్నారుల సంరక్షణకు సంబంధించి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తల్లిదండ్రులు సరిగా చూసుకోవడం లేదనే ఆరోపణలపై భారత సంతతి పిల్లలను నార్వే అధికారులు కస్టడీలోకి తీసుకోవడం ఇది మూడోసారి.
2011లో మూడున్నరేళ్లు, ఏడాదిన్నర వయసున్న ఇద్దరు పిల్లలను అధికారులు తీసుకెళ్లగా నాటి యూపీఏ ప్రభుత్వం పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించాల్సిందిగా నార్వే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. అనంతరం చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించాలని నార్వే కోర్టు తీర్పునిచ్చింది. 2012 డిసెంబరులో ఇదే విషయమై మరో భారతీయ జంటను అధికారులు జైలులో వేశారు. 7 ఏళ్లు, రెండేళ్ల వయసున్న వారి ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌లోని తాతయ్య, అమ్మమ్మల దగ్గరకు పంపించారు.