
ఆటా సభలో జూపల్లి రామేశ్వరరావును సన్మానిస్తున్న దృశ్యం
( షికాగో నుంచి సాక్షి ప్రతినిధి జి.గంగాధర్)
రెండు రాష్ట్రాల్లోని సహజ వనరులతో వేగంగా అభివద్ధి చేసేందుకు ఉభయ ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవాలని శనివారం ఫిలడెల్ఫియా (అమెరికా)లో జరిగిన రాజకీయ వేదిక కార్యక్రమంలో వక్తలు సూచించారు. ఆటా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా మై హోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పరస్పర దూషణలు,ఆరోపణలు, విమర్శలు మానుకుని జల వివాదాలను, కరెంట్, ఇతర సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం స్పేహ పూర్వకంగా వ్యవహరించాలని, అధిక నిధులను రాబట్టుకుని అభివద్ధి చేయాలని వక్తలు ప్రత్యేకంగా తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్‌రావును కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ ఎం కోదండరాం, కో చైర్మన్ దేవీప్రసాద్‌రావు, టీఆర్‌ఎస్ ధాన కార్యదర్శి వి ప్రకాష్, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రసమయి బాల్‌కిషన్, సునీత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ ఎంపీ మధుయాష్కీ, పారిశ్రామిక వేత్త వినోన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సహకారాన్ని అందజేస్తాం
ఆటా బిజినెస్ ఫోరంలో మాట్లాడిన వక్తలు రెండు రాష్ట్రాల అభివద్ధికి అవసరమైన సహకారాన్ని అంజేస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే రెండు ప్రభుత్వాలు ప్రాధాన్యత రంగాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, విద్య, వైద్య, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయాలని కోరారు. తమ సొంత ప్రాంతాలపై తమకు ఎంతో మమకారం ఉందని, అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయిన తరువాత కూడా ఘర్షణ పడడం సరికాదని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో నేషనల్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.
అలరించిన సాంస్కతిక కార్యక్రమాలు
ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం నిర్వహించిన కార్యక్రమంతోపాటు తెలంగాణ బోనాలు, ఇతర సాంస్కతిక కార్యక్రమాలను ప్రేక్షకులను అలరించాయి. రెండు రాష్ట్రాల్లో దశ దిశ చివరి కార్యక్రమాన్ని కె.రామచంద్రామూర్తి నిర్వహించారు. ఆటా మూడు రోజుల పాటు నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్, బ్యాట్‌మెంటన్ క్రీడా కారుడు పుల్లెల గోపీచంద్, సినీ తారలు రాణా దగ్గుబాటి, శ్రీయ, రిచా గంగోపాధ్యాయ, సినీ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.
ఆటా నూతన అధ్యక్షుడిగా వరంగల్ జిల్లా గర్మిళ్లపల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ సుధాకర్ పెరికారీ ఎన్నికయ్యారు. ఆయన 2015 జనవరి నుంచి ఆటా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తారు.