'దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా విభజన'
Published Wed, Feb 19 2014 10:11 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
కువైట్: ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ, బిజెపిలు కుమ్మక్కై తెలుగు ప్రజలను నిట్ట నిలువునా అతి దారుణంగా చీల్చారు అని కువైట్ లోని ప్రవాసాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకసభలో విభజన తీరు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఉంది అని ప్రవాసాంధ్రులు నాయని మహేశ్వర్ రెడ్డి, గోవింద్ నాగరాజులు ఆరోపించారు.
పార్లమెంట్ లో అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి తెలంగాణ బిల్లును అప్రజాస్వామ్యంగా ఆమోదించిన తీరుపై కువైట్లోని హవెల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ కువైట్ విభాగం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో నాయని మహేశ్వర్ రెడ్డి, గోవింద్ నాగరాజు పలువురు నేతలు మాట్లాడారు.
కేవలం ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, బీజేపీలు కలిసి సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తెలంగాణ బిల్లును అప్రజాస్వామ్య పద్దతిలో ఆమోదించడం హేయమైన చర్య అని అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చరిత్ర హీనులుగా మిగులి పోతారని విమర్శించారు. చంద్రబాబు, కిరణ్ లకు ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమములో యంవి నరసారెడ్డి, ఆకుల ప్రభాకర్ రెడ్డి, రమణ యాదవ్, రహ్మాన్ ఖాన్, తెట్టు రఫీ, కె వాసు దేవారెడ్డి, మహబూబ్ బాషా, దుగ్గి గంగాధర్, నియాజ్, సజాద్, మర్రి కళ్యాణ్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement