
పది ఆటోలు... రూ. 50 వేలు మాత్రమే
– ఆర్టీఏ వాహనాల వేలంలో వ్యాపారుల రింగ్
అనంతపురం సెంట్రల్ : రోడ్డు రవాణాశాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో పాత వాహనాలకు నిర్వహించిన వేలంపాటలో గుజిరీ వ్యాపారులంతా రింగ్ అయ్యారు. వందలాది వాహనాలను అతి తక్కువ ధరకే దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలకు మంగళవారం డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (డీటీసీ) కార్యాలయంలో వేలం పాట నిర్వహించారు. ఆర్‌టీఓ శ్రీధర్, ఎంవీఐలు వరప్రసాద్, రమేష్, ఏఎంవీఐలు, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల సమక్షంలో వేలంపాట జరిగింది. గుజిరీ వ్యాపారులు దాదాపు 200 మందికి పైగా పాల్గొని ముందస్తు ఒప్పందం ప్రకారం అతి తక్కువ ధరకే వాహనాలను దక్కించుకున్నారు. పది ఆటోలు రూ. 50 వేలకు అమ్ముడుపోయాయి.
ద్విచక్ర వాహనాల్లో కొన్ని ఇంకా రోడ్డు మీద తిరిగేందుకు అవకాశముండే వాటిని కూడా తక్కువ ధరకు అప్పగించేశారు. మొత్తం 10 వాహనాలకు కేవలం 70 వేలు మాత్రమే వచ్చింది. ఇందులో ఒక హీరోహోండా స్పెండర్, బజాజ్ కంపెనీకి చెందిన రెండు ద్విచక్రవాహనాలు మన్నికలో ఉండేవి కావడం గమనార్హం. ఏడాది కూడా తిరక్కనే ఆర్టీఓ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. 192 ఆటోలు రూ. 11.56 లక్షలు, 7 మ్యాక్సీ క్యాబ్‌లు రూ. 3.08 లక్షలు, 13 ట్రాక్టర్లు రూ. 9.86 లక్షలు, 2 మోటార్ కార్లు రూ. 70 వేలు, 29 గూడ్స్ వెహికల్స్ రూ. 3.56 లక్షలకు అమ్ముడుపోయాయి. వీటి ద్వారా రవాణాశాఖకు రూ. 29.52 లక్షలు ఆదాయం రాగా, కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు రూ. 21, 08, 501 ఆదాయం వచ్చింది. వేలం పాట ప్రారంభానికి ముందే వ్యాపారస్తులంతా చర్చించుకుని ఎక్కువ ధరకు వెళ్లకుండా జాగ్రత్తలు పడ్డారు.