జిల్లాకు పదివేల ఈ పాస్ యంత్రాలు
- నగదు రహిత లావాదేవీల కోసం ప్రతిపాదన
- రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానున్న నగదు సమస్య
- డీసీసీ సమావేశంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్) : రానున్న రోజుల్లో నగదు కొరత మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉందని, సమస్యను ఎదుర్కొనేందుకు బ్యాంకు అధికారులు నగదు రహిత లావాదేవీలను మరింత ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సూచించారు. పది రోజుల్లో జిల్లాకు కనీసం పది వేల ఈపాస్ యంత్రాలను తెప్పించి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శనివారం సాయంత్రం కాన్ఫరెన్స్‌హాల్‌లో బ్యాంకర్లతో డీసీసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగదు కొరతను అధిగమించడంలో బ్యాంకుల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించడంతోపాటు ప్రతి ఒక్కరికీ ఏటీఎం, రూపే కార్డులను పంపిణీ చేయాలన్నారు. ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాకు అవసరమైన స్వైపింగ్ మిషన్లు, మినీ ఏటీఎంలను తెప్పించాలన్నారు. కిరాణం షాపులు, ప్రైవేట్ విద్యా సంస్థలు, మెడికల్ షాపులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు తదితర వాటిల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని 445 బ్రాంచుల్లో ప్రభుత్వం తరపున ఒక అధికారిని నియమస్తామని, ఈయన బ్యాంకు ఖాతాల ప్రారంభంలోనూ, ఇతరత్రా కార్యక్రమాల్లో బ్యాంకర్లకు సహకరిస్తాన్నారు. వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు జీరో బ్యాలెన్స్‌తో ఖాతాను ప్రారంభిస్తే స్వైపింగ్ మిషన్లను పంపిణీ చేయాలన్నారు. తమ దగ్గర లైసెన్సులు పొందిన వ్యాపారులందరూ స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకొని నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పది రోజుల్లో నగదు రహిత లావాదేవీలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి అన్ని వర్గాల ప్రజలను వీటివైపు మళ్లించాలని సూచించారు.
బ్యాంకుల్లో డబ్బుల్లేవు సారూ..
బ్యాంకుల్లో డబ్బులు లేవని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని దాదాపు అన్ని బ్యాంకుల అధికారులు కలెక్టర్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు సహా దాదాపు అన్ని బ్యాంకుల అధికారులు నగదు కొరతపై కలెక్టర్‌కు వివరించారు. జిల్లాకు రూ.160 కోట్లు వచ్చినా, అన్ని రెండు వేల నోట్లే వచ్చాయని, అందువల్ల చిల్లర సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. జిల్లాకు అవసరమైన నగదును తెప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. సమావేశంలో జేసీ హరికిరణ్, ఎల్‌డీఎం నరసింహరావు, ఆంధ్రాబ్యాంకు డీజీఎం గోపాలకృష్ణ, ఎస్‌బీఐ ఆర్‌ఎం రమేష్‌కుమార్ పాల్గొన్నారు.