15 నుంచి రైతు సమస్యలపై ఉద్యమం | 15th to dharna on farmer problems | Sakshi
Sakshi News home page

15 నుంచి రైతు సమస్యలపై ఉద్యమం

Published Sat, Aug 12 2017 10:49 PM | Last Updated on Mon, Aug 13 2018 9:04 PM

15th to dharna on farmer problems

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు
- యూత్‌ పాలసీ కోసం సెప్టెంబర్‌లో ఆందోళనలు
- నంద్యాల చుట్టూనే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు  


అనంతపురం న్యూసిటీ: రైతు సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ఉద్యమించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. అనంతపురంలో జరిగిన సీపీఎం రాష్ట మహాసభల్లో చేసిన తీర్మానాలను ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటిన్నర లక్షల హెక్టార్ల భూమి సాగులోకి రాలేదని, ఇందులో ఒక్క రాయలసీమలోనే పదిహేడున్నర లక్షల ఎకరాలు సాగుకు నోచుకోలేదన్నారు.  రైతులు ఎంతటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఇట్టే తెలిసిపోతోందన్నారు.

పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీ అమలుకు అసెంబ్లీలో ఒక చట్టం చేసి, సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ, కర్నూలులో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పి విస్మరించారన్నారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 15 నుంచి 30 వరకు ఆందోళన చేపడతామన్నారు.

యూత్‌ పాలసీ తీసుకురావాలి  : యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం యూత్‌ పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని మధు పేర్కొన్నారు. ఈ పాలసీ ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు, సాంస్కృతిక, క్రీడలు నిర్వహించి, వారిలోని సృజనాత్మకతను వెలికితీయొచ్చన్నారు. ఇప్పటికే కేరళ, ఒరిస్సా, కర్నాటక ప్రాంతాల్లో యూత్‌ పాలసీ నడుస్తోందన్నారు. యూత్‌పాలసీ కోసం సెప్టెంబర్‌ 1 నుంచి 15 వరకు ఆందోళనలు చేపడుతామన్నారు.

నంద్యాల చుట్టూనేనా..:
    రాష్ట్రంలో ఏమీ లేనట్టు తెలుగుదేశం ప్రభుత్వం నంద్యాలలో మకాం వేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి నెలరోజులకుపైగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు నంద్యాల చుట్టూ తిరుగుతున్నారన్నారు.  ఇది ఏరకంగానూ సహించలేనిదన్నారు. నంద్యాల ఎన్నికల్లో బీజేపీ కూటమితో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీని ఓడించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర నేత ఓబులు, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, నేతలు నల్లప్ప, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఇవీ తీర్మానాలు :
- మద్యంషాపులు, బెల్టుషాపులు రద్దు కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం  
- అంగన్‌వాడీ, మునిసిపల్‌ కార్మికులకిచ్చిన హామీలు నెరవేర్చడం  
- ప్రజా సమస్యలపై రోడ్డుపైకి వస్తే పోలీసులతో కేసులు పెట్టించడం
- దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా పోరాటాలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement