జిల్లాలో ఇప్పటికి 31 శాతం వరినాట్లు
జిల్లాలో ఇప్పటికి 31 శాతం వరినాట్లు
Published Wed, Jul 19 2017 11:47 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
-నెలాఖరుకల్లా పూర్తిచేయాలి
-వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్
కరప(కాకినాడ రూరల్) : జిల్లాలో ఇంతవరకు 31 శాతం మేర ఖరీఫ్ వరినాట్లు పడ్డాయని వ్యవసాయ సంయుక్త సంచాలకుడు జేవీఎస్ ప్రసాద్ తెలిపారు. కరప మండలం వలసపాకలలో బుధవారం ఆయన డీడీఏ వీటీ రామారావుతో కలిసి వెదజల్లిన పంటపొలాలను, నారుమళ్లను పరిశీలించి, రైతులకు సూచనలుచేశారు. సార్వాలో 2.32 లక్షల హెక్టార్లలో వరిసాగు చేయాల్సి ఉండగా 71,568 హెక్టార్లలో నాట్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. నెలాఖరుకల్లా వరినాట్లు పూర్తిచేసుకోవాలని సూచించారు. ప్రత్తినాట్లు 35 శాతం వేశారన్నారు. వరిలో సూక్ష్మపోషకాల లోపాన్ని అరికట్టేందుకు నూరుశాతం రాయితీపై ఇస్తున్న జిప్సం, జింకు, బోరాన్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు జిల్లాలో పెద్దగా నష్టం జరగలేదన్నారు. వెదజల్లిన పొలాలు ముంపునకు గురైతే మళ్లల్లోంచి నీరుపోయేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా గోతుల్లో పడిన విత్తనాల మొలకశాతం దెబ్బతింటే మళ్లీ జల్లుకుంటే సరిపోతుందని చెప్పారు. పల్లపు ప్రాంతాల్లో వరినాట్లు వేసిన పొలాలు ముంపుకు గురైతే నీరుతీసేసి, బూస్టర్ డోస్‌గా 10 కిలోల యూరియా, 15 కిలోలు పొటాష్ వేయాలన్నారు. శిలీంధ్ర, కీటకనాశిని మందులు హెక్సాకొనజోల్, కార్బండిజమ్, క్లోరిఫైరిపాస్, మోనోక్రోటోపాస్ మందులలో ఏదో ఒకటి పిచికారీ చేస్తే పంటతెగుళ్లు అదుపుచేయవచ్చన్నారు.
కౌలు రైతులకు రూ.101 కోట్ల రుణాలు
జిల్లాలో 1,34,777 కౌలురైతులు ఉండగా 81,820 మందికి రుణఅర్హత కార్డులు ఇచ్చి, వివిధ బ్యాంకుల ద్వారా రూ 101.73 కోట్లు పంటరుణాలు అందజేశామని ప్రసాద్ తెలిపారు. 59,600 మంది సాగురైతులకు సీఓసీ కార్డులు ఇవ్వగా రూ.58 కోట్లు రుణాలు ఇచ్చారన్నారు. రుణాలు తీసుకునే రైతులు ప్రధానమంత్రి ఫసలీ బీమా పథకం ప్రీమియం ఆగష్టు 21లోగా చెల్లించాలని, రుణాలు తీసుకోని రైతులు ఎకరానికి రూ.587 లు ప్రీమియంగా ఈనెలాఖరులోగా చెల్లించాలని సూచించారు.
రైతురథంలో 680 ట్రాక్టర్లు
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాయితీపై ట్రాక్టర్లు ఇచ్చేందుకు రైతురథం పథకంలో జిల్లాకు 680 ట్రాక్టర్లు మంజూరయ్యాయని జేడీ తెలిపారు. నియోజకవర్గాల వారీగా కేటాయించిన ట్రాక్టర్ల కోసం జిల్లాఇన్‌చార్జ్ మంత్రి ఆమోదంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంఏఓ ఎ.అచ్యుతరావు, ఏఈఓలు ఎస్.సత్యనారాయణస్వామి, ఐ.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీఈఓలు కె.దివ్య, కె.సాయిశరణ్య, సొసైటీ అధ్యక్షుడు నక్కా వీరభద్రరావు, సర్పంచ్ వాసంశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement