ఆగివున్న ఇన్నోవా వాహనం సైడ్ అద్దం పగులగొట్టి అందులోని నగదు, డాక్యుమెంట్లు, వివిధ బ్యాంకుల చెక్కులను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం పట్టపగలు ఆపహరించుకుపోయారు.
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా): ఆగివున్న ఇన్నోవా వాహనం సైడ్ అద్దం పగులగొట్టి అందులోని నగదు, డాక్యుమెంట్లు, వివిధ బ్యాంకుల చెక్కులను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం పట్టపగలు ఆపహరించుకుపోయారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం సమీపంలో చోటుచోసుకుంది. స్థానిక సీఐ జగదీశ్వర్ కథనం ప్రకారం వివరాలు.. నగరంలోని హబ్సిగూడకు చెందిన అంతోని అనే బిల్డర్ మన్నేగూడ సమీంపలోని ప్రముఖ టౌన్ షిప్‌లో అపార్టుమెంట్ నిర్మిస్తున్నాడు. కూలీలకు డబ్బులు చెల్లించేందుకు వాహనంలో సుమారు నాలుగు లక్షల రూపాయలను తీసుకోచ్చాడు. ప్లాట్ల రిజిష్ట్రేషన్ వుండటంతో ఇబ్రహీంపట్నం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయానికి ఇన్నోవా వాహనంలో వచ్చారు. సమీపంలో వున్న మజీద్ వద్ద వాహనాన్ని నిలిపి సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయంలోనికి వెళ్లాడు. అరగంట వ్యవధిలోనే తిరిగి వాహనం వద్దకు చేరుకోని చూసే సరికి సైడ్ అద్దం పగలివుంది.
అందులోని రెండు బ్యాగులను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకేళ్లారు. ఒక దాంట్లో సుమారు 4 లక్షల నగదు, వివిధ బ్యాంకుల చెక్కుబుక్కులు, మరో బ్యాగులో విలువైన డాక్యుమెంట్లు వున్నాట్లు తెలిపారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆయా రోడ్లలో వున్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు రెండు వాహనాలపై ఇన్నోవా వద్ద నిల్చుని ఉన్నట్టు అక్కడున్న స్థానికులు తెలిపారు. వందలమంది తిరిగే సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయం వద్ద పట్టపగలు చోరి జరగడంపట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని సీఐ జగదీశ్వర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాట్లు తెలిపారు.