గ్యాంగ్‌స్టర్ నయీం, అతడి అనుచరులు సాగించిన దందాలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది.
నయీం దందాలతో సంబంధాలున్నాయనే దిశగా విచారణ
వారి ఆస్తులు, సెల్‌ఫోన్ డేటా సేకరణ
రెండు వాహనాలు స్వాధీనం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం : గ్యాంగ్‌స్టర్ నయీం, అతడి అనుచరులు సాగించిన దందాలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు చెందిన 40 మంది రియల్టర్లకు నయీం భూ దందాల్లో భాగస్వామ్యం ఉందని భావిస్తోంది. ఈ మేరకు వారి ఆస్తులు, సెల్‌ఫోన్ డేటాను సేకరించి లోతుగా విచారణ జరుపుతోంది. తాజాగా సిట్ అధికారులు కరీంనగర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతోపాటు వారు ఉపయోగించే స్కోడా, వోక్స్‌వాగన్ కార్లును సైతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మంథని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నయీం అనుచరుడుగా చలామణి అవుతున్నట్లు గుర్తించిన సిట్ అధికారులు అతడిపై విచారణ జరుపుతున్నారు.
గతంలో ఆ వ్యక్తి ఇంటిలో శుభకార్యానికి నయీం స్కోడా, వోక్స్‌వ్యాగన్ కార్లలో మంథని వచ్చినట్లు తెలిసింది. అప్పటినుంచి సదరు వ్యక్తులు ఆయా వాహనాల్లోనే తిరుగుతూ నయీం ఇచ్చిన గిఫ్ట్‌గా సన్నిహితుల వద్ద చేప్పుకునే వారని ప్రచారం జరుగుతోంది. సదరు వ్యక్తులను సిట్ అదుపులోకి తీసుకునే క్రమంలో వీరు ఈ వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారని సమాచారం. కేసుతో ఈ వాహనాలకు కూడా సంబంధం ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకుని కరీంనగర్‌లోని ఓ రహస్య ప్రాంతానికి తరలించారని తెలిసింది.
నాలుగు జిల్లాల్లో రియల్టర్ల దందా!
సిట్ అధికారులు అనుమానిస్తున్న 40 మంది రియల్టర్లు కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీరు ఇప్పటివరకు ఏయే ప్రాంతాల్లో వెంచర్లు, ఇతర దందాలు నిర్వహిస్తున్నారో పూర్తి సమాచారం సేకరించి వాటి ద్వారా వివరాలు రాబట్టే పనిలో పడ్డారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటకు చెందిన ఓ రియల్టర్ జిల్లాతోపాటు హైదారాబాద్, భువనగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయగా.. వీటిలో రెండు వెంచర్లలో నయీం ముఠా కూడా పాలుపంచుకుందని సిట్ అధికారులు గుర్తించారు. సదరు రియల్టర్‌కు మిత్రుడైన ఓ హెడ్‌కానిస్టేబుల్ కూడా పెద్ద ఎత్తున రియల్ దందా చేయడంతో అతడిని కూడా విచారించడానికి సిట్ రంగం సిద్ధం చేసిందని సమాచారం. ఇప్పటికే సిట్ సభ్యులు సదరు రియల్టర్, హెడ్‌కానిస్టేబుల్‌కు చెందిన సెల్ రికార్డులు, బ్యాంక్ రికార్డులు పరిశీలించారని తెలిసింది. వీటిలో రెండు చోట్ల నయీంతో సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం రియల్టర్‌తోపాటు సదరు హెడ్‌కానిస్టేబుల్‌కు చెందిన ఫోన్లు పని చేయడం లేదని తెలిసింది. దీనిపై మరింత లోతుగా విచారించాలని నిర్ణయించిన సిట్ బృందం వారిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు కరీంనగర్ జిల్లాలో నాలుగు కేసులు నమోదు కావడంతో ఈ కేసుల్లో రమేశ్, గోపీ ప్రధాన నిందితులుగా భావిస్తున్న సిట్ బృందం వారిపై లోతుగా విచారణ ప్రారంభించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఏ క్షణమైనాlవీరిని అరెస్టు చూపే అవకాశం ఉందని తెలిసింది. వీరి ఆస్తులను సైతం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది.