92 మంది పండిట్లకు పదోన్నతులు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ఉన్నతీకరించిన తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితుల పోస్టులకు గురువారం పదోన్నతులు కల్పించారు. స్థానిక సైన్స్‌సెంటర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 92 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా (గ్రేడ్–1) పదోన్నతులు కల్పించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి.లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సజావుగా జరిగింది.
నేడు బదిలీల కౌన్సెలింగ్
తెలుగు, హిందీ పండిట్లకు శుక్రవారం సైన్స్ సెంటర్‌లో బదిలీల కౌన్సెలింగ్ ఉంటుంది. ఉదయం 8 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. తెలుగు, హిందీ పండిట్లకు విడివిడిగా రెండు హాళ్లలో ఏక కాలంలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. తెలుగు 509 మంది, హిందీ 325 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారన్నారు.
నెరవేరిన రెండు దశాబ్దాల కల
గ్రేడ్–1 భాషా పండితుల పోస్టులను పండిట్ల ద్వారా భర్తీ చేయాలనే డిమాండ్ దాదాపు రెండు దశబ్దాల తర్వాత నెరవేరింది. దీంతో భాషా పండితులు సంబరాలు జరుపుకున్నారు. పదోన్నతుల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణను వారు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్‌యూపీపీ తులసిరెడ్డి, ఎర్రిస్వామి, ఎస్‌ఎల్‌టీఏ నాయకులు ఆదిశేషయ్య, శివానందరెడ్డి, సలీం, వేణుగోపాల్, సలీం తదితరులు పాల్గొన్నారు.