Published
Tue, Jul 26 2016 12:39 AM
| Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
మూడు నెలల్లో రూ.980కోట్లు
భువనగిరి/యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు రెవెన్యూ పెరిగిందని, మూడు నెలల కాలంలో రూ. 980 కోట్లు వచ్చినట్లు డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ వెల్లడించారు. సోమవారం నల్లగొండ జిల్లాలో ఆయన మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పర్యటించారు. భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూరులో సబ్‌రిజిస్ట్రార్‌కార్యాలయాల పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది రూ.3,100కోట్ల రెవెన్యూ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రజలకు సేవలందిస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంతభవనాలు ఉండాలని సీఎం సూచించి ప్రత్యేకంగా నిధులు కేటాయించారన్నారు. తెలంగాణలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే కేవలం మూడింటికే సొంత భవనాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 91 కార్యాలయాలకు సొంతభవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల అక్రమాలు నిరోధించడానికి మేఐ హెల్ప్‌యూ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా బోగస్ రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటున్నామన్నారు. కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, రిజిస్ట్రార్ అండ్ స్టాంప్ ఐజీ, కమిషనర్ అహ్మద్ నదీమ్, ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎన్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.