థియేటర్లో సినిమా చూస్తూనే..!
ఏలూరు (పశ్చిమ గోదావరి) : సినిమా చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి చిత్రం చూస్తుండగానే అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాములపర్రు గ్రామానికి చెందిన నక్కా రాజబాబు(37) ఉండిలోని సూర్యాథియేటర్‌కి మ్యాట్నీ సినిమాకి వెళ్లాడు. అక్కడ సినిమా చూస్తూ మరణించాడు. విషయం తెలుసుకున్న థియేటర్ సిబ్బంది అతని మృతదేహాన్ని థియేటర్ బయట పడవేశారు. దీంతో తన కొడుకు ఎలా చనిపోయాడో ఏం జరిగిందో తేల్చాలని రాజబాబు తండ్రి రాములు, చిన్నాన్న నక్కా తాతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎవరో ఓ వ్యక్తి తమకు ఫోన్ చేసి రాజబాబు ఉండి సూర్యా థియేటర్‌లో సినిమా చూస్తూ చనిపోయాడని, సినిమాహాలు సిబ్బంది అతని మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చి పారవేశారని చెప్పినట్లు వారు వెల్లడించారు. రాజబాబు మృతి అనుమానాస్పదంగా ఉండడంతో కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.రవివర్మ తెలిపారు.