కబ్జా చేసి.. చదును చేస్తూ..
రూ.100 కోట్ల ప్రభుత్వ స్థలం ప్రైవేటుపాలు
ఆక్రమించి చదును చేస్తున్న జన్మభూమి కమిటీ సభ్యుడు
మిగిలిన ముగ్గురు పేదల గుడిసెలు ఖాళీ
బాధితుల ఫిర్యాదు మేరకు అక్కడకు వెళ్లిన ‘సాక్షి’
సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరంలోని అదెమ్మదిబ్బ ప్రాంతంలో సర్వే నంబర్ 730/2సీ2లో ఉన్న (3.54 ఎకరాలు) రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని అధికార తెలుగుదేశం పార్టీ నేత, జన్మభూమి కమిటీ సభ్యుడు యథేచ్ఛగా కబ్జా చేశారు. అక్కడ గుడిసెలు, రేకు షెడ్లు వేసుకుని నివసిస్తున్న 110 మంది పేదలను నయానో భయానో ఖాళీ చేయించారు. మూడు నెలలుగా ఈ తంతు జరుగుతున్నా సంబంధిత అధికారులు అంతంత మాత్రంగానే స్పందించ డం గమనార్హం. ఆ స్థలం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ 1985లో సేకరించి నగరపాలక సంస్థ పాఠశాల నిర్మాణానికి అప్పగించారని ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో సహా కథనాలను ప్రచురించినా రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం, స్థలంపై విచారణ జరిపి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. తాజాగా స్థలం కొన్నానంటూ చెబుతున్న రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఆ గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఏ దిక్కూలేక మూడు నెలలుగా ప్రతిఘటించి అక్కడే ఉంటున్న ముగ్గురు పేద కుటుంబాలను సోమవారం ఖాళీ చేయించే ప్రక్రియ ప్రారంభించారు. చుట్టూ కంచె, మధ్యలో రేకుల షెడ్డు ఉన్నా కంచె వేయడంతో అక్కడ ఉన్న వృద్ధుడిని ఖాళీ చేయించారు. అతను తన సామాగ్రిని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ వృద్ధుడి ఇంటిని కూలీలు నేలమట్టం చేశారు. మిగిలిన రెండు పూరిగుడిసెలవారిని తమ సామాగ్రి బయట పెట్టుకోవాలని బెదిరిస్తున్నారు. ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పకోవాలో అర్ధంగాక వారు ‘సాక్షి’కి ఫోన్ చేశారు.
నా స్థలంలోకి ఎందుకు వచ్చావ్ ?
బాధితుల ఫిర్యాదు మేరకు ఆదెమ్మదిబ్బ ప్రాంతానికి ‘సాక్షి’ వెళ్లి చూడగా రేకుల షెడ్డు తొలగిస్తూ, ఆ ప్రాంతాన్ని పొక్లెయిన్‌తో చదును చేస్తున్నారు. రేకుల షెడ్డు వృద్ధుడు చెప్పిన మేరకు అతడి నివాసాన్ని పరిశీలించేందుకు అక్కడకి వెళ్లగా ‘ ఈ స్థలం నేను కొన్నాను. లోపలికి ఎందుకు వచ్చావ్? ఎవరు ఇక్కడకు రమ్మన్నారు?’ అంటూ పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇక్కడకు వచ్చానని, మీరు ఈ స్థలం కొనుగోలు చేస్తే పత్రాలు చూపించాలని అడగ్గా, స్థలం పత్రాలు కావాలంటే అర్బన్‌ఎమ్మార్వోను అడగాలని చెప్పుకొచ్చారు.