ఏసీబీ వలలో ఆర్టీసీ డీఎం
Published Tue, Aug 22 2017 11:25 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టబడిన వైనం
నిడదవోలులోని డీఎం ఇంట్లోనూ సోదాలు
కీలక పత్రాలు స్వాధీనం
నిడదవోలు : ఏపీఎస్‌ఆర్టీసీ నిడదవోలు డిపో మేనేజర్ జీఎల్‌పీవీ సుబ్బారావు మంగళవారం ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. డిపో నిర్వహణలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బిల్లులు మంజూరు విషయంలో డీఎం జీఎల్‌పీవీ సుబ్బారావు సొమ్ములు డిమాండ్ చేస్తుండగా కాంట్రాక్టర్ కైలా రామకృష్ణరావు ఏసీబీ అధికారులకు సంప్రదించారు. డిపోలో 2016 నుంచి చైతన్య జ్యోతి సంక్షేమ సంఘం అనే ప్రైవేట్ సంస్థ ద్వారా నలుగురు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. డిపోలో ఉదయం ఇద్దరు, సాయంత్ర వేళలో ఇద్దరు స్వీపర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఈ ఏడాది మే, జూన్ నెలలకు జీతాలకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ రామకృష్ణారావు బిల్లులు మంజూరు చేయమని పలుమార్లు డీఎంను అడిగారు. ఇందుకు తనకు రూ.5 వేలు ఇవ్వాలని డీఎం సుబ్బారావు డిమాండ్ చేవారు. దీంతో కాంట్రాక్టర్ రామకృష్ణారావు ఈనెల 21న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
మధ్యాహ్న వేళ మాటువేసి..
కాంట్రాక్టర్ రామకృష్ణారావు ఫిర్యాదు మేరకు పట్టణానికి మంగళవారం మధ్యాహ్నం 12 మంది సభ్యుల ఉన్న ఏసీబీ అధికారులు బృందం చేరుకుంది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కాంట్రాక్టర్ రామకృష్ణారావు డీఎం చాంబర్‌కు చేరుకుని రూ.5 వేలు ఇస్తుండగా ఆరుగురు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అదేసమయంలో మరో ఆరుగురు ఏసీబీ అధికారులు డీఎం ఇంట్లోనూ సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ డీఎం సుబ్బారావు నుంచి రూ.5 వేలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా డీఎం సుబ్బారావుకు రూ.2 వేలు లంచం ఇచ్చానని, బిల్లుల మంజూరుకు మళ్లీ సొమ్ములు చేశారని కాంట్రాక్టర్ చెబుతున్నారు. డీఎం చాంబర్‌లోని రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించారు. డీఎం వద్ద స్టేట్‌మెంట్స్ నమోదు చేసుకున్నారు. పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ సమీపంలోని డీఎం సుబ్బారావు ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు రికార్డులు, బ్యాంకు ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement