
చెట్టు కొమ్మ గొంతులో దిగినా..
ప్రమాద వశాత్తు చెట్టు కొమ్మ గొంతులో దిగినా.. ప్రాణాలతో బయటపడ్డాడో వ్యక్తి.
ప్రమాద వశాత్తు చెట్టు కొమ్మ గొంతులో దిగినా.. ప్రాణాలతో బయటపడ్డాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలో గురువారం అకస్మాత్తుగా పెనుగాలులు వీచాయి. ఆ తీవ్రతకు జిల్లాలోని కథలాపూర్ గ్రామ సమీపంలో ఉన్న ఓ పెద్ద మర్రిచెట్టు కొమ్మ కూలి పోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన లారీపై పడింది. కొమ్మ ధాటికి లారీ నుజ్జు నుజ్జు అయ్యింది.
చెట్టు ఎండిన కొమ్మ ఒకటి క్యాబిన్ లోకి దూసుకు వచ్చి డ్రైవర్ గొంతులోకి దిగింది. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని బాన్స్ వాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి.. గొంతులో నుంచి కొమ్మను తొలగించారు. డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పిందని.. అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.