అత్యాచారం కేసులో నిందితుల అరెస్టు
కర్నూలు: కర్నూలు మండలం ఉల్చాల గ్రామ శివారులోని పొలాల్లో రాజకుమారి అనే మహిళపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను తాలూకా పోలీసులు అరెస్టు చేసి కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఎదుట హాజరుపరిచారు. శుక్రవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన వివరాలను వెల్లడించారు. హైదరబాదులోని రామాంతపూర్ కాలనీ ఇందిరానగర్‌లో నివాసముంటున్న రాజకుమారి వ్యభిచార వృత్తి చేస్తూ జీవనం సాగిస్తోంది. సి.బెళగల్ మండలం గుండ్రేవుల గ్రామానికి చెందిన కొంకల భాస్కర్‌రెడ్డి అక్టోబర్ 28వ తేదీన రాజకుమారికి ఫోన్ చేసి రాత్రి ఉల్చాల గ్రామానికి రప్పించుకున్నాడు. అదే గ్రామానికి చెందిన చాకలి శేఖర్, బోయ భాస్కర్‌లతో కలసి ఊరు శివారులోని పొలాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె దగ్గరున్న బంగారు పుస్తెల గొలుసు, సెల్‌ఫోన్ లాక్కుని ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. ఆమె హైదరాబాదుకు చేరుకుని అక్టోబర్ 29వ తేదీన ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిమిత్తం తాలూకా పోలీసులకు కేసును బదలాయించారు. ఈ మేరకు గత నెల 25వ తేదీన తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని శుక్రవారం నిడ్జూరులోని శింగవరానికి వెళ్లే బీటీ రోడ్డు దగ్గర నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు చైన్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ వెల్లడించారు.