
ఇండస్ట్రీలో తొక్కేస్తారన్న భయం లేదు: హేమ
కాకినాడ : కాపుల రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని సినీ నటి హేమ అన్నారు. గురువారం కాకినాడలో జరిగిన కాపు మహిళ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ కాపు ఉద్యమనేత, ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి తాను ఉడతాభక్తిగా సాయం అందించేందుకు సినీ పరిశ్రమ నుంచి తనకు తానుగా వచ్చినట్లు తెలిపారు.
కాపు ఉద్యమంలో పాల్గొంటే చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకుండా తొక్కేస్తారన్న భయం తనకు లేవని హేమ అన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇతర కులాల నాయకులు ఎందుకు ఆ పార్టీ నుంచి పోటీ చేశారని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ సదస్సులో పాల్గొన్నవారంతా కంచాలను గరిటలతో కొడుతూ మహిళలు తమ నిరసన తెలిపారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి “జై సమైక్యాంధ్ర పార్టీ’’ తరపున హేమ ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే.