Published
Fri, Aug 5 2016 10:18 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
92 మిశ్రమ, సుస్థిర వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటు
పోతవరం (పి.గన్నవరం) :
జిల్లాలో 92 మిశ్రమ, సుస్థిర వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుతున్నట్టు ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.పద్మజ వెల్లడించారు. ఇప్పటికే 66 క్షేత్రాలు ప్రారంభం కాగా, మరో 26 యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వరి చేనులో చేపల పెంపకానికి సంబంధించిన మిశ్రమ వ్యవసాయ క్షేత్రాన్ని పోతవరంలో శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ప్రతి అంగుళం భూమినీ రైతులు సద్వినియోగం చేసుకుంటూ మిశ్రమ పంటలతో అదనపు ఆదాయం పొందాలని సూచించారు. ఇందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోందని వివరించారు.
మిశ్రమ వ్యవసాయ విధానంలో.. ఎకరం చేను చుట్టూ మూడడుగుల లోతున కందకం తవ్వి, దానిలో చేపలు పెంచడం, చేను మధ్యలో వరి, గట్లపై కూరగాయలు పండిస్తారని చెప్పారు. ఇందుకుగానూ ఒక్కో క్షేత్రానికి రూ.25 వేల రాయితీ ఇస్తున్నారన్నారు. సుస్థిర వ్యవసాయ క్షేత్రంలో.. వరి చేనులో ఒకవైపు చిన్న చెరువు తవ్వడం, గట్లపై కూరగాయలు, అపరాలు పండించడం, పశువులను, కోళ్లను పెంచడం చేపట్టాలని పద్మజ వివరించారు. ఈవిధమైన వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకునే రైతులకు రూ.20 వేల రాయితీ ఇస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 46 మిశ్రమ వ్యవసాయ క్షేత్రాలు ప్రారంభం కాగా మరో 18 యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అలాగే, 20 సుస్థిర వ్యవసాయ క్షేత్రాలు ప్రారంభం కాగా, మరో 8 మంది రైతులకు వీటిని మంజూరు చేస్తామని చెప్పారు. తక్కువ నీటితో పంటలు పండించాలన్న లక్ష్యంతో రైతులకు అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద జిల్లాకు రూ.25 లక్షలు మంజూరైనట్టు ఆమె చెప్పారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ, పంటలు పండించడంపై అధ్యయనం చేసేందుకు జిల్లాలో రెండు విడతలుగా మొత్తం 70 మంది రైతులను మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు పంపుతున్నట్టు పద్మజ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ జె.ఎలియాజర్, ఏఓ సీహెచ్‌డీ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.