ఆది నుంచి తుది వరకు | Aditi Dead Body Found In Bhogapuram Dibbapalem Beach | Sakshi
Sakshi News home page

ఆది నుంచి తుది వరకు

Published Fri, Oct 2 2015 8:37 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

ఆది నుంచి తుది వరకు - Sakshi

ఆది నుంచి తుది వరకు

గుండెలు పిండే విషాదం.. ముద్దులొలికే చిన్నారి అదితి మురుగు నీటిలో మునిగిపోయిందన్న వార్త ఈనెల 24వ తేదీ సాయంత్రం దావానలంలా వ్యాపించింది. నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వ యంత్రాంగం కదిలివచ్చింది. ఎలాగైనా అదితిని కాపాడాలని తపన పండింది. జీవీఎంసీ, నేవీ సిబ్బంది, పోలీసులు డ్రైనేజీ కాల్వలు, గెడ్డల్లో, సముద్రంలో ఏడు రోజులపాటు తీవ్రంగా గాలించారు. రకరకాల వార్తలతో ఈ వారమంతా ఉత్కంఠతో గడిచింది. చివరకు కన్నీరే మిగిలింది.     - విశాఖపట్నం/పెదవాల్తేరు

సెప్టెంబర్ 24
సాయంత్రం 4 గంటలకు సీతమ్మధారలోని ఇంటి నుంచి అదితి డాక్టర్ వీఎస్ కృష్ణ కళాశాల రోడ్డు భానునగర్‌లోని ఐవోఎస్ ట్యూషన్ సెంటర్‌కు వెళ్లింది. నగరమంతా కుంభవృష్టి కురవడంతో వర్షం నీటితో మురుగు కాల్వలు పొంగిపొరలుతున్నాయి. సాయంత్రం 7 గంటల ప్రాంతం లో ట్యూషన్ ముగిశాక కారెక్కబోతూ వర్షం నీటితో నిండిన డ్రైనేజీలో పడిపోయింది. జీవీఎంసీ సిబ్బంది వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు భానునగర్ నుంచి ఎంవీపీకాలనీ సెక్టార్ వరకు గెడ్డలో గాలించారు. పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్, డీసీపీ త్రివిక్రమ్‌వర్మ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

సెప్టెంబర్ 25
వేకువజాము 5 గంటల నుంచి అదితి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భానునగర్ నుంచి ఇసుకతోట, ఎంవీపీకాలనీ మీదుగా లాసన్స్ బేకాలనీ వద్ద సముద్రంలో కలిసే గెడ్డ వరకు నాలుగు పొక్లయిన్లతో పూడికలు, చెత్తను తొలిగించారు. 250 మంది పారిశుధ్య, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది గెడ్డలో చిన్నారి ఆచూకీ కోసం వెదికారు. నేవీ సిబ్బంది ఒక హెలికాప్టర్‌లో రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలో గాలించారు. 15మంది గజ ఈతగాళ్లు గెడ్డ, సముద్రంలో వెదికారు. అదితి తాత ఫిర్యాదు మేరకు ఎంవీపీకాలనీ పోలీసులు అదితి అదృశ్యమైందని కేసు నమోదు చేశారు.

సెప్టెంబర్ 26
ఉదయం నుంచి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది గెడ్డలో వెతకడం ప్రారంభించారు. వందమంది వరకు భానునగర్ నుంచి లాసన్స్‌బేకాలనీ సముద్రం వరకు గాలించారు. నేవీ గజ ఈతగాళ్లు సైతం ఇందులో పాల్గొన్నారు. నేవీ డైవర్లు సముద్ర గర్భం లోపలికి వెళ్లి అదితి కోసం గాలించారు. హెలికాప్టర్ పైనుంచి సముద్రంలో గాలించారు. 10 బోట్లలో మత్స్యకారులు సముద్రంలో గాలించారు. పొక్లయిన్‌లతో మరోసారి గెడ్డలోని రాళ్లు తీసి క్షుణ్ణంగా వెదికారు. పోలీసులు కిడ్నాప్ అనుమానంతో అదితిని తీసుకురావడానికి వెళ్లిన కారు డైవర్ గురునాథాన్ని ప్రశ్నించారు.

సెప్టెంబర్ 27
అదితి అదృశ్యం మిస్టరీగా మారింది. గెడ్డ, సముద్రంలో ఆచూకీ లభ్యం కాకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. అదితి సహవిద్యార్ధిని తాన్వీని పోలీసులు సమాచారం అడిగారు. అదితి డ్రైనేజీలో పడిపోవడం కళ్లారా చూశానని ఆమె స్పష్టం చేసింది. ఈ రోజు కూడా యధావిధిగా గెడ్డ సముద్రంలో మత్స్యకారులు, నేవీ సిబ్బంది గాలించారు. అదితి తండ్రి శ్రీనివాస్, తాత రమణమూర్తి కిడ్నాప్ చేసుంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేయాలని భావించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారిని విచారించారు.

సెప్టెంబర్ 28
అదితి ఆచూకీ కోసం గెడ్డలో నీటిని నిలిపి అన్వేషించారు. 50మంది మత్స్యకారులు పది పడవల్లో రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలో 50 కిలోమీటర్ల మేర గాలించారు. అదితి ట్యూషన్ సెంటర్ పక్కనే ఉన్న మెడికల్ షాప్‌లోని సీసీ కెమెరాల పుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. ట్యూషన్‌కు వెళ్తున్న దృశ్యం అందులో రికార్డయింది. మున్సిపల్ పరిపాలన పట్టాణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కరికాల్ వరినన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కమిషనర్ అమిత్‌గార్గ్ డీసీపీ త్రివిక్రమ్ వర్మ నేతృత్వంలో ప్రత్యేక ఇన్విస్టిగేషన్ టీమ్‌ను నియమించారు.

సెప్టెంబర్ 29
అదితి ఆచూకీ కోసం జీవీఎంసీ, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు గెడ్డ, సముద్రంలో గాలించారు. భీమిలి నుంచి ఫిషింగ్ హార్బర్ వరకు వలలతో వెదికారు. పోలీసులు మాత్రం కిడ్నాప్ కోణంలో విచారణ ప్రారంభించారు. కారు డైవర్ కాల్ డేటా, ఇతర వివరాలపై ప్రత్యేక బృందం దృష్టి సారించారు. నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అదితి అదృశ్యంపై ఆరా తీశారు. అదితి తండ్రి శ్రీనివాసరావు, తాత రమణమూర్తి సీఎంను కలిశారు.  

సెప్టెంబర్ 30
భీమిలి నుంచి గంగ వరం పోర్టు వరకు వంద కిలోమీటర్లమేర వెదికారు. రాత్రి 10 గంటల వరకు అదితి ఆచూకీ లభ్యం కాకపోవడంతో గాలింపును నిలిపివేస్తున్నట్టు జీవీఎంసీ ప్రకటించింది. సాయంత్రం అదితి తండ్రి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమకు శత్రువులెవరూ లేరని, తమ పాప ఎక్కడో క్షేమంగా వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదితి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షలు బహుమతి ప్రకటించారు.

అక్టోబర్ 1
అదితి మృతదేహం గురువారం సాయంత్రం భోగాపురం తీరంలో బయటపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement