మార్చి 2 నుంచి అహోబిలం బ్రహ్మోత్సవాలు
మార్చి 2 నుంచి అహోబిలం బ్రహ్మోత్సవాలు
Published Tue, Feb 21 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM
- మార్చి 13 వరకు నిర్వహణ
- ఏర్పాట్లపై ఆర్డీఓ సమీక్ష
నంద్యాల: అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ రామ సుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం.. అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. దొంగతనాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల స్నానాలకు తెలుగుగంగ కాల్వ ద్వారా నీటి సౌకర్యాన్ని కల్పించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులకుససూచించారు.ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ అధికారులదేనన్నారు. భక్తుల సంఖ్యకు తగినట్లు ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలన్నారు. విద్యుత్ సమస్య లేకుండా 24గంటలు సరఫరా చేయాలని చెప్పారు.
వైద్యశాఖ అధికారులు.. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతోపాటు అబులెన్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పావన నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గించొద్దని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో మద్యం విక్రయాలను నియంత్రించాలన్నారు. అనంతరం ఆర్‌డీఓతోపాటు దేవస్థానం ఈఓ మల్లికార్జునప్రసాద్ తదితరులు.. బ్రహ్మోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో తెలుగుగంగ డీఈ నరసింహారెడ్డి, ఇన్‌చార్జి ఆర్‌టీఓ జీవీ రమణ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రవికుమార్, ప్రొహిబిషన్ ఎస్‌ఐ చంద్రహాస్, , ఫైర్ ఆఫీసర్ హేమంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ ముక్తార్, ఫారెస్ట్ ఆఫీసర్ రామ్‌సింగ్, మెడికల్ ఆఫీసర్ గుణశేఖర్, ఎంపీడీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Advertisement