మా శవాల మీద ఎయిర్‌పోర్టు కట్టండి
మా శవాల మీద ఎయిర్‌పోర్టు కట్టండి
Published Thu, Sep 29 2016 8:59 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
– పైసా పైసా కష్టార్జితంతో కొన్న
ప్లాట్లను లాక్కోవద్దు
– మా జీవితాల్ని బుగ్గి చేయొద్దు
– భూమికి భూమి ఇవ్వాల్సిందే
– తెగేసి చెప్పిన ప్లాట్ల యజమానులు
గన్నవరం :
విమానాశ్రయ విస్తరణ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ సామాజిక ప్రభావ మదింపు గ్రామసభల్లో అధికారులకు రైతులు, భూ యాజమానుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. విమానాశ్రయ విస్తరణకు తమ విలువైన భూములను ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. గురువారం మండలంలోని అల్లాపురం గ్రామపంచాయితీ కార్యాలయంలో నూజివీడు సబ్‌కలెక్టర్ లక్ష్మీశా నేతృత్వంలో గ్రామసభ జరిగింది. విమానాశ్రయ విస్తరణ కోసం సేకరించనున్న గ్రామ పరిధిలోని మూడు వెంచర్లలో ప్లాట్స్ కొనుగోలు చేసిన భూ యాజమానులు పెద్ద సంఖ్యలో ఈ సభకు హాజరయ్యారు. రెవెన్యూ అధికారులు రియల్ వెంచర్లను కూడా వ్యవసాయ భూములుగా పరిగణించి పరిహారం చెల్లిస్తామని చెప్పడంతో భూయాజమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం
సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు చెందిన తామందరూ రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బుతోపాటు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని రియల్ ఎస్టేట్ ప్లాట్స్‌ను కొనుగోలు చేశామని తెలిపారు. భవిష్యత్‌లో పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, ఇంటి అవసరాలకు సాయపడతాయనుకున్న స్థలాలను విమానాశ్రయ విస్తరణ కోసం తీసుకుంటమంటే చూస్తూ ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు. కాదని బలవంతంగా భూ సేకరణకు చేయలనుకుంటే, తమ సమాధులపైన విమానాశ్రయ రన్‌వేను నిర్మించుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
450 మంది నష్టపోతున్నాం
చిరు వ్యాపారులు, చిరుద్యోగులతో పాటు కొంతమంది పదవీ విరమణ చేయగా వచ్చిన డబ్బుతో పాటు బ్యాంక్ రుణాలతో ఉడా, సీఆర్‌డీఏ అనుమతులతో సుమారు 450 మంది వరకు ఈ ప్లాట్ల (స్థలాలు)ను కొనుగోలు చేశామని తెలిపారు. కుటుంబ ఆధారమైన వీటిని ప్రభుత్వం లాగేసుకుంటే తమ బతుకులు ఛిన్నాభిన్నం ఆవుతాయని, జీవితమంతా వాటి అప్పులు కట్టేందుకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూమికి బదులు భూమి ఇవ్వాలని, లేనిపక్షంలో భూసేకరణను జరగనీయమని స్పష్టం చేశారు.
భగ్గుమన్న బాధితులు
ఈ సందర్భంగా అధికారుల తీరుపై ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెందిన వేదవతి తీవ్రంగా మండిపడ్డారు. తమ సమస్యను పరిష్కరించాలని ఆరు నెలలుగా తామంత అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోలేదని, ఇప్పుడు బలవంతంగా ప్లాట్స్ స్వాధీనానికి రావడం దారుణమన్నారు. విస్తరణ వల్ల 400 వరకు ప్లాట్స్ పోతుండగా, మరో 52 ప్లాట్స్ నో కనష్ట్రక్షన్ జోన్‌లో పెట్టారని తెలిపారు. కేవలం రెండవ రన్‌వే నిర్మాణం కోసమే ప్రభుత్వం పెద్ద మొత్తంలో భూములు సేకరిస్తోందని, తమకు న్యాయం చేసే వరకు ప్లాట్స్ ఇచ్చేది లేదని, లేదంటే తమ శవాల మీద విమానాశ్రయాన్ని విస్తరించుకోవాలని జోగి నాగేశ్వరరావు అనే బాధితుడు తెగేసిచెప్పాడు. రెవెన్యూ అధికారులు భూసేకరణ నోటీసులను తామకు కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవ్వడాన్ని పలువురు ప్లాట్ల యజమానులు ప్రశ్నించారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే
జనాగ్రహంతో ఉన్నతాధికారులకు ఏం పాలుపోలేదు. స్పందించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రావు, తహశీల్దారు ఎం. మాధురి పాల్గొన్నారు.
Advertisement