
బీజేపీకి వకాల్తా పుచ్చుకున్నారా?
• ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అక్బరుద్దీన్ మండిపాటు
• కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించొద్దని హితవు
• రాజకీయ పార్టీల విరాళాలు ఆపేయాలని కేంద్రానికి సూచన
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బీజేపీకి వకాల్తా పుచ్చుకున్నట్లు వ్యవహరిస్తున్నారని ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్రాన్ని గుడ్డిగా సమర్థించొద్దని.. రాష్ట్రానికి అపార నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ‘మీరు రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలను మెచ్చుకుంటున్నాం.. మీకు అండగా ఉంటున్నాం.. మీరేమో బీజేపీకి అండగా నిలబడుతున్నారు’అని వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుపై అసెంబ్లీలో చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్లధనం, ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు తీసుకునే చర్యలను వ్యతిరేకించే వారెవరూ ఉండబోరన్నారు.
దేశంలో బీజేపీ ఏది చెబితే అది జాతీయవాదం.. బీజేపీని వ్యతిరేకిస్తే దేశ ద్రోహం అన్న ధోరణి కొనసాగుతోందని విమర్శిం చారు. కుప్పకూలుతున్న బ్యాంకింగ్ వ్యవస్థను, కొన్ని కార్పొరేట్ శక్తులను కాపాడేందుకు కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందని, ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. నల్లధనం రూపు మాపేందుకు చేపట్టిన చర్యగా ప్రభుత్వం చెబుతున్న లక్ష్యం పక్కదారి పట్టిందని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
దేశంలో ఇప్పటికే రూ.17.70 లక్షల కోట్ల నగదు బ్యాంకులకు చేరిందని, ప్రభుత్వం అంచనాకు మించినంత డబ్బు బ్యాంకుల్లో జమ అవుతుందని, ఇక నల్లధనం మిగిలిందెక్కడ అని ప్రశ్నించారు. చేతనైతే రాజకీయ పార్టీలు వసూలు చేసే విరాళాలను ఆపేయాలని కేంద్రానికి సూచిం చారు. 2005 నుంచి 2015 వరకు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ కలసి రూ.5,450 కోట్ల విరాళాలు వసూలు చేసినట్లు డెమోక్రటిక్ రిఫారŠమ్స్ ఆఫ్ ఇండియా ప్రస్తావించిన లెక్కలను ఉటంకించారు. రాజకీయ పార్టీల వసూళ్లు అవినీతి కిందకు రాదా అని ప్రశ్నిం చారు. రాజకీయ పార్టీల వసూళ్లకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అసెంబ్లీకి సూచించారు.
తెలంగాణలో 9వేల గ్రామాలు ఏటీఎంలకు దూరంగా ఉన్నాయని, బ్యాంకులు, 4 వేలకు పైగా తపాలా కార్యాలయాలు లేని గ్రామాలు ఉన్నాయని చెప్పారు. నగదు రహిత లావాదేవీలు ఎంతవరకు సురక్షితమో సమీక్షించు కోవాల్సిన అవసరముందని, సైబర్ నేరాల నియం త్రణకు ఒక చట్టం కూడా ఇప్పటివరకు లేదని పేర్కొన్నారు. నోట్ల రద్దుతో హైదరాబాద్ తీవ్రంగా నష్టపోయిందని, నిత్యావసరాలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహితంగా చేసేందుకు 4 వేలకు పైగా స్వైపింగ్ మెషీన్లు, 22 వేల మంది బ్యాంకు ఉద్యోగులు కావా లని ఇటీవలే మంత్రి హరీశ్‌రావు ఓ ఇంటర్వూ్యలో పేర్కొన్నారని, ఆ లెక్కన రాష్ట్రమంతటా దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటం సాధ్యమవు తుందా అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.