
అక్కడ మూత..ఇక్కడ మోత..
మందుబాబులతో కిటకిటలాడిన తాడేపల్లి రహదారులు
గుంటూరు (తాడేపల్లి రూరల్) : విజయవాడలో మద్యం మరణాల నేపథ్యంలో మద్యం షాపులు మూతబడడంతో మంగళవారం తాడేపల్లి మద్యం షాపుల్లో మోత మోగింది. మద్యం బాబులతో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లు కిక్కిరిసిపోయాయి. రోడ్ల వెంబడి ఉన్న మద్యం దుకాణాల్లో కొనుగోలుదారులు బారులు తీరారు. బార్ షాపుల్లో మద్యం తాగేందుకు అనుమతి ఉన్నా, అక్కడ ఖాళీ లేక, వైన్‌షాపుల్లో కొంతమందికి అవకాశం ఉన్నా, అక్కడ స్థలం లేక మద్యం బాబులు రహదారులను, పంట పొలాలను, కృష్ణాతీరాన్ని బార్లుగా మార్చుకున్నారు.
దీంతో రహదారులపై ప్రయాణించే వారికి అవస్థలు ఎదురయ్యాయి. ఇదిలా ఉంటే తాడేపల్లిలోని 1వ వార్డులో సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. విజయవాడ ఘటన నేపథ్యంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఉదయం 11 గంటల వరకు గస్తీ నిర్వహించారు. దీంతో మద్యం దొరక్క మందుబాబులు 1వ వార్డులోని పలు ప్రాంతాల్లో సారా కోసం పరుగులు తీశారు. ఇది గమనించి ఎక్సైజ్ శాఖ వారు గస్తీ నిర్వహించడంతో మందుబాబులు అక్కడనుంచి కూడా పలాయనం చిత్తగించారు.