'వైఎస్ జగన్ జలదీక్షకు సర్వం సిద్ధం'
కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జలదీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ దీక్షను ప్రారంభిస్తారని చెప్పారు. కృష్ణా జలాల నీటి మళ్లింపు.. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ జలదీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.
మే 16 నుంచి మే 18 వరకు కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు వైఎస్ జగన్ జలదీక్ష కొనసాగనున్నట్టు చెప్పారు. వైఎస్ జగన్ జలదీక్షకు మద్దతుగా అన్ని మండల హెడ్‌క్వార్టర్స్‌లలో మే 17న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు జలదీక్ష చేపట్టనున్నట్టు తలశిల రఘురాం పేర్కొన్నారు.
కర్నూలు వేదికగా మూడు రోజుల పాటు సాగే వైఎస్ జగన్ జలదీక్షకు మద్దతుగా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు, రైతులు కర్నూలుకు చేరుకుంటున్నారు. వైఎస్ జగన్ జలదీక్షకు రాయలసీమ, కృష్ణా డెల్టా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. అయితే జలదీక్ష ఏర్పాట్లను వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే విశ్వేశ్శర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, జయరాములు, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, ఐజయ్య, గౌరు చరితారెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పర్యటించారు.